భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలను తమ ఆధీనంలో పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థుల మీదకు వేట కుక్కల మాదిరిగా ఉసిగొల్పుతున్న కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడుదాదమని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని డిసెంబర్ చివరి నాటికి ప్రతిష్టించబోతున్నామని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ వాదులందరూ.. హైదరాబాద్ వైపు చూసే రోజు త్వరలోనే రాబోతోందన్నారు మంత్రి కేటీఆర్. అంబేద్కర్ కలలుగన్న సమాజం తెలంగాణలో ఆవిష్కృతం కాబోతుందన్నారు. దళిత పారిశ్రామివేకత్తలకు అండగా నిలబడేందుకు టీ ప్రైడ్ ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ పథకం కింద 200 కోట్ల రాయితీలను 3 వేల మంది దళిత పారిశ్రామికవేత్తలకు అందిచామని తెలిపారు. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనే విషయంలో అందరం ఏకీభవంతో ఉన్నామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ పోరాటం ఒక వైపు అయితే.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని చెప్పక తప్పదన్నారు. ముందుచూపు కలిగిన దార్శనికుడు అంబేద్కర్ అని పేర్కొన్న కేటీఆర్.. ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందన్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను, మండలాలను ఏర్పాటు చేసుకున్నాం. గిరిజన సోదరుల కోసం తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాం. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
భారతదేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై ఎవరికీ అగౌరవం లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఆయన రాసిన రాజ్యాంగం ఒక్క దళితులదే కాదు.. అందరిదీ. భారతీయుల కోసం అంబేద్కర్ ఒక్కటే రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగం పట్ల అందరికీ గౌరవం ఉంది. కానీ కొందరు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. వారి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వ్యవస్థలను కుప్పకూలుస్తున్నది ఎవరు? వ్యవస్థాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలను చేస్తున్నదేవరు? రాజ్యాంగబద్ద వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అరాచకపు రాజకీయాలు చేస్తున్న వారిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ సూచించారు.
ఎస్సీ విద్యార్థుల కోసం గురుకులాలను స్థాపించి, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. 75 ఏండ్ల స్వాతంత్ర్య చరిత్రలో ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి దళిత బంధు లాంటి పథకాన్ని అమలు చేయలేదు. మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాలి. అంబేద్కర్ జయంతి అంటే భయపెట్టే పరిస్థితులు తేవొద్దు. దళితుల కోసం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కేటీఆర్ సూచించారు. 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ఈ దేశంలో ఎక్కడైనా ప్రతిష్టించారా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ మాటలను చేతల్లో చేసి చూపిస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ బాటలోనే సంక్షేమానికి బాటలు వేసుకుంటున్నామని తెలిపారు. దళిత బంధు విజయవంతమైతే.. దేశమంతా మన వైపు చూసే రోజులు వస్తాయన్నారు. దళిత బంధు కార్యక్రమాన్ని ఒక సవాలుగా తీసుకొని విజయవంతం చేద్దామన్నారు. దళితులు సంపద సృష్టిస్తారనే పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందించాలన్నారు. విమర్శ కోసమే విమర్శ, రాజకీయం కోసం రాజకీయం అన్నచందంగా వ్యవహరించొద్దు. ఈ పథకం విజయవంతమైతే దేశంలోని కోట్లాది మంది దళితులకు లాభం జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.