హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎవరు రానున్నారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంటున్నది. మొన్నటివరకు ఛైర్మన్‌గా వ్యవహరించిన మారెడ్డి శ్రీనివాసరెడ్డి పదవీకాలం జనవరి 18తో పూర్తవ్వడంతో ప్రస్తుతం సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ పదవి ఖాళీగా ఉంది. అయితే మళ్లీ మారెడ్డికే ఛైర్మన్‌గా అవకాశమిస్తారన్న వాదనలు వినిపిస్తుండగా, ఇచ్చే అవకాశాలు లేవన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే సమయంలో కార్పొరేషన్ ఛైర్మన్‌గా హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అయితే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ సినారియో నడుస్తుండడంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు కార్పోరేషన్లను భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి గతంలోనూ ఒకే సారి నాలుగు కార్పోరేషన్లకు ఛైర్మన్లను భర్తీ చేశారు. తాజాగా జనవరి 18న సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ సీటు ఖాళీ అవ్వడంతో మళ్లీ మారెడ్డికే ఇవ్వాలా లేక కొత్త వ్యక్తులకు ఇవ్వాలా అన్న అంశాలపై ప్రభుత్వం ఆలోచిస్తోంది.
తాజాగా పరిశీలనలోకి బొంతు పేరు..
ఖాళీగా ఉన్న సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని హైదరబాద్ మేయర్‌గా పనిచేసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా మంతనాలు జరుగుతున్నాయి. దీంతో ఛైర్మన్‌గా పరిశీలనలోకి బొంతు పేరు కూడా వచ్చింది. అయితే పరిశీలనలో ఉన్న వీరిద్దరే కాకుండా గతం నుంచీ పార్టీలో ఉంటున్న ఇంకొంతమందిపై కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
బొంతా, మారెడ్డా.?
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న హెచ్‌ఎండీఏ ఛైర్మన్ పదవిని కూడా భర్తీ చేయాలన్న భావనతో ఉన్న ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలన్న దానిపై సందిగ్ధతలో ఉంది. ఒకవైపు సివిల్ సప్లై కార్పోరేషన్, మరో వైపు హెచ్‌ఎండీఏ ఛైర్మన్ పదవులు ఉన్న నేపథ్యంలో వీరిద్దరికి ఏ సంస్థలైతే బాగుంటుందన్న అంశంలోనూ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి గతంలో మేయర్‌గా పనిచేయడంతో బొంతుకు హెచ్‌ఎండీఏ ఛైర్మన్, మారెడ్డికి సివిల్ సప్లై ఛైర్మన్‌గా ఇచ్చే అవకాశాలే ఉన్నాయని తెలుస్తున్నా..మారెడ్డిపై ఛైర్మన్‌గా ఉన్న సమయంలో వచ్చిన ఆరోపణలతో నిర్ణయం మారినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే మారెడ్డి ఎమ్మెల్సీని ఆశించి భంగపడిన నేపథ్యంలో కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని అప్పగించనున్నట్టు కూడా చర్చ జరుగుతుంది. దీంతో ఈ రెండు కార్పోరేషన్లపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో మరి.