Tuesday, November 26, 2024

హుజురా బాద్‌షా ఎవరు? ప్రచారానికి ఇంకా పది రోజులే!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రజలను ఆకర్షిస్తున్న హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి ఇంకా పది రోజులే గడువు ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు జోరు పెంచాయి. బతుకమ్మ, దసరా పండుగ రావడంవల్ల మూడు, నాలుగు రోజులుగా ఎన్నికల ప్రచారానికి ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు దూరంగా ఉన్నారు. ఐదు నెలలుగా టీఆర్‌ఎస్‌ నాయకులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై నియోజకవర్గాన్ని హీటెక్కించారు. బతుకమ్మ, దసరా పండు గల సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలందరూ సొంతూళ్లకు వెళ్లిపోవడంతో నియోజకవర్గం సైలెంట్‌గా మారింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో ఆదివారం సమావేశం నిర్వహించిన కేసీఆర్‌ హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌దే నని ప్రకటించడంతో పాటు హుజూరాబాద్‌లో బహిరంగసభను కూడా కన్‌ఫామ్‌ చేయడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. బీజేపీ నేతలు మాత్రం లోకల్‌ ప్రచారాన్నే నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా టూర్‌ పై ప్రచారం ఉన్నా ఖరారు చేయలేదు.

ప్రచారంలో పెరిగిన వేగం
పండుగ అనంతరం తిరిగి నియోజకవర్గానికి చేరుకున్న నాయకులు ఆదివారం నుండి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మండలాల వారీగా చేరుకున్న ఆయా పార్టీల ఇన్‌ఛార్జీలు ప్రచార వేగాన్ని పెంచారు. పోలింగ్‌కు మరో 12 రోజులే గడువు మిగిలి ఉండడం, 72 గంటల ముందే స్థానికేతరులు నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం సూచిస్తుండడంవల్ల ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ఓటర్లను తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. అయితే పోలింగ్‌ ప్రక్రియ ముగిసే వరకు స్థానికులైన ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి ఇనగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, బీసీ కమిషన్‌ చైర్మన్‌ కృష్ణమోహన్‌రావు తదితర స్థానిక టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌కు అండగా ఉండనున్నారు.

- Advertisement -

టీఆర్‌ఎస్‌, బీజేపీ హోరాహోరీ.. బలంగా ఢీకొడతామంటున్న కాంగ్రెస్‌
18 ఏళ్లుగా ఎమ్మెల్యే, మంత్రిగా పదవిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌ బల్మూరి స్థానికేతరుడు కావడం.. ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఇతర పార్టీల్లో చేరిపోవడం పార్టీకి నష్టం కలిగించింది. ఐదు నెలల నుంచి నియోజక వర్గంలో మ కాం వేసిన టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు సంబంధించిన స్థానికేతర ప్రచార తారలు 27న సాయంత్రం హుజురాబాద్‌ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లక తప్పడు. ఆ తర్వాత అక్కడ ఉన్న స్థానిక నాయకులు పోల్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవహారాన్ని చక్క బెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. హుజూరాబాద్‌కు నాలుగైదు కిలోమీటర్లు దాటితే ఇతర నియోజకవర్గాలు ఉండ డంతో.. పక్క నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు మకాం వేసి అన్నీ చక్కబెట్టే అవకా శాలున్నాయి. ఇక హుజురాబాద్‌ ఉప ఎన్నికకు సీపీఐ దూరంగా ఉంటోంది. అందుకు కారణాలను వివరిస్తూ ప్రకటన చేయడం చర్చ నీయాంశంగా మారింది. ఈటలకు మద్దతుగా బీఎస్పీ నిలిచే అవకాశమున్నట్లు ప్రచారముంది.

27న సీఎం కేసీఆర్‌ సభ
మరోవైపు హుజురాబాద్‌ ఉప ఎన్నికను అధికార టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మంగా తీసుకుంది. ఇందులో భాగంగా ఈనెల 27న సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో హుజురాబాద్‌లో సభ నిర్వహించేందుకు నిర్ణయించారు. హుజూరాబాద్‌లో ఎన్నికల కోడ్‌కు ఇబ్బందిరాకుండా పెంచికల్‌ పేటలో సభ నిర్వహించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్‌ బై ఎలక్షన్‌లో గెలిచి తీరుతామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఈ సభను విజయవంతంగా చేసేందుకు ప్రణాళికలు రచించారు. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితబంధు ప్రారంభసభ నిర్వహించారు. ఇది పార్టీకి బాగా ప్లస్‌ అయిందని నేతలు చెబుతున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై టీఆర్‌ఎస్‌ కాన్ఫిడెంట్‌గా ఉంది. బీజేపీ నేతలు కూడా మెజారిటీ తగ్గించగలిగినా గెలుపుకు ఢోకాలేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement