తిరుపతి ఉపఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీని అచ్చెన్నాయుడు వీడియో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టీడీపీని టార్గెట్ చేస్తూ అచ్చెన్నాయుడిపై వైసీపీనే స్టింగ్ ఆపరేషన్ చేయించిందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పైగా వైసీపీకి మద్ధతుగా ఆకుల వెంకటేష్ అనే వ్యక్తి ప్రకటనలు చేస్తున్నాడు. ఆ వ్యక్తి అచ్చెన్నాయుడు వీడియోలో కీలకం. ఇంతకూ ఆకుల వెంకటేష్ ఎవరు? ఎందుకు ఇదంతా చేస్తున్నాడు?
ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణతో ఆకుల వెంకటేష్ అనే వ్యక్తికి 400 గజాల స్థలం విషయంలో వివాదం ఉంది. ఈ విషయంలో మాట సాయం చేయమంటే చంద్రబాబు, లోకేష్ పట్టించుకోవటం లేదని, తాను పార్టీనే నమ్ముకుంటే ఇలా చేస్తారా అని ఆకుల వెంకటేష్ ప్రధాన ఆరోపణ. అందుకే తిరుపతికి వెళ్లి అచ్చెన్నాయుడుతో మాట్లాడానని… సభలో చొక్కా విప్పి విసిరేశానని.. వైసీపీకి ఏం సంబంధం లేదని… ఆయన అదే పనిగా ప్రచారం చేస్తున్నాడు. ఆకుల వెంకటేష్ అనే వ్యక్తి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ నేతగా ఉన్నారు. టీడీపీ తెలంగాణలో బలంగా ఉన్నప్పుడు ఆయన ఆ పార్టీ నేతగా పలు దందాలు చేయడానికి ప్రయత్నించేవారని ప్రచారం ఉంది. టీఆర్ఎస్‌లో చేరిన ఓ జూబ్లీహిల్స్ నేతకు అనుచరుడిగా ఉండేవాడు. కానీ టీడీపీ హడావిడి లేకపోయే సరికి వెంకటేష్ కూడా సైలెంట్ అయ్యాడు. కానీ దాదాపు ఆరు కోట్ల విలువ చేసే స్థల వివాదంలో తనకు కనీసం 2కోట్లు వచ్చేలా ఉన్నాయని, ఇందులో కేఎల్ నారాయణకు ఓ మాట చెప్పాలని లోకేష్, చంద్రబాబును కోరుతున్నాడు. తాను 30ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే సహాయం చేయరా అంటూ వెంకటేష్ రచ్చ చేస్తున్నాడు.
కాగా తిరుపతి ఉప ఎన్నిక సందర్భంలో టీడీపీని దెబ్బకొట్టే వ్యూహాంతోనే ఇదంతా చేశారని, పైగా వైసీపీ అనుకూల మీడియా ద్వారా ఎక్కువ ప్రచారం చేయటం చూస్తుంటే ఇది కుట్ర అని తేలికగా అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.