కరోనా వేరియంట్లు ఒకదాని తర్వాత మరొకటి బయటపడుతోన్న నేపథ్యంలో వాటిని ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు నిరోధించగలవా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్లకు కూడా లొంగని విధంగా కరోనా రూపాంతరం చెందే అవకాశం ఉందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ స్పందిస్తూ… వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తట్టుకోగలిగే వైరస్ రకాలు ఇప్పటివరకు వెలుగు చూడలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తుల్లో మాత్రం వ్యాక్సిన్లను తట్టుకుని మనగలిగే కరోనా వేరియంట్లు రావని మాత్రం కచ్చితంగా చెప్పలేమని తెలిపారు.
ఆ వైరస్ కొత్తరూపు సంతరించుకుంటూనే ఉంటుందని చెప్పారు. కరోనా వేరియంట్ల గురించి భయపడుతూ వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. ప్రపంచంలోని ప్రతి దేశంలో సెప్టెంబరు నాటికి కనీసం 10 శాతం మందికి వ్యాక్సిన్లు వేయాలని చెప్పారు. అలాగే ఈ ఏడాది చివరి నాటికి కనీసం 30 శాతం మందికి వ్యాక్సిన్లు వేయాలని కోరారు. వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలు ఉండడం సరికాదని చెప్పారు. తాము సూచించినట్లు వ్యాక్సిన్లను ప్రాధాన్యక్రమంలో అందించి ఉంటే కరోనాపై పోరులో ముందున్న అన్ని వర్గాలకు ఇప్పటికే వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో అంది ఉండేవని తెలిపారు. ప్రపంచంలోని పలు దేశాల్లో వ్యాక్సిన్ల కొరత ఉందన్నారు. కరోనాను అరికట్టడంలో విజయం సాధిస్తోన్న దేశాలు తమ దేశాల్లో చిన్నారులకు వ్యాక్సిన్లు ఇవ్వడాన్ని నిలిపివేసి వాటిని కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాలకు పంపాలని ఆయన సూచించారు. ప్రపంచంలోని కొన్ని దేశాలు అత్యధిక వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు.
కరోనా ముప్పు తక్కువగా ఉన్న వారికీ వ్యాక్సిన్లు ఇస్తున్నారని, దీని వల్ల ఇతర దేశాల్లో కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉన్న వర్గాలకు వ్యాక్సిన్లు అందడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ సంస్థ నేతృత్వంలో ప్రారంభమైన వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమం ‘కొవాక్స్’ ద్వారా ఇప్పటి వరకు 124 దేశాలకు 70 మిలియన్ల డోసుల వ్యాక్సిన్ను అందజేసినట్లు వివరించారు. భారీ స్థాయిలో వ్యాక్సిన్లను నిల్వ చేసుకున్న దేశాలు వాటిని కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలకు పంపాలని టెడ్రోస్ అధనామ్ కోరారు.