కరోనా సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు భీకరంగా పెరుగుతున్నాయి. దీంతో దేశంలోని అనేక రాష్ట్రాలు తాత్కాలికంగా ఆంక్షలు పెడుతున్నాయి. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నాయి. దీంతో ఏ రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
✪ దేశ రాజధానిలో వీకెండ్ లాక్ డౌన్ అమల్లో ఉంది. అత్యవసర సేవలు మినహా అన్నింటిపైనా ఆంక్షలున్నాయి. జిమ్ములు, పబ్బులు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, రెస్టారెంట్లు అన్నీ మూసివేశారు. ఇతర రాష్ట్రాల మధ్య ప్రయాణాలను మాత్రం కేంద్రం సూచన మేరకు అనుమతిస్తున్నారు.
✪ ఫస్ట్ వేవ్ తరహాలోనే సెకండ్ వేవ్‌లోనూ దేశంలోని మహారాష్ట్రలో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మే 1 వరకు జనతా కర్ఫ్యూ అమల్లో ఉంది. జనం గుమిగూడకుండా ఉండేందుకు 144సెక్షన్ విధించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూసివేయగా… హోటళ్లకు టేక్ హోం మాత్రమే అవకాశం ఇచ్చారు. అత్యవసర కేటగిరి మినహా అన్ని రకాల వస్తువు, ప్రయాణాలపై ఆంక్షలున్నాయి.
✪ యూపీలోనూ కేసులు పెరుగుతుండటంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలపై నిషేధం విధించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ తప్పనిసరి చేశారు.
✪ రాజస్థాన్‌లోనూ ఏప్రిల్ 19వరకు వీకెండ్ కర్ఫ్యూ అమల్లో ఉంది. ముందస్తుగా నిర్ణయమైన పెళ్లిళ్లు మినహా మరే మీటింగ్ లకు అనుమతి లేదు. అత్యవసర సేవలు, కూరగాయలు, గ్యాస్ సేవలకు అంతరాయం లేదు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ టెస్ట్ తప్పనిసరి.
✪ మధ్యప్రదేశ్‌లో కరోనా కర్ఫ్యూ పేరుతో లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని ప్రకటించారు.
✪ తెలుగు రాష్ట్రాలకు పొరుగున ఉన్న కర్ణాటకలోనూ కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బెంగుళూరు సహా ముఖ్యమైన ఏడు జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. చండీఘడ్, మహారాష్ట్ర, పంజాబ్, కేరళ రాష్ట్రం నుండి వచ్చే వారికి ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి.
✪ పంజాబ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతొ విద్యాసంస్థలు, సమావేశాలు రద్దు చేసి ఏప్రిల్ 30వరకు నైట్ కర్ఫ్యూ విధించారు.
✪ ఉత్తరాఖండ్ రాష్టంలో కుంభమేళా జరుగుతుండటంతో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. 50 శాతం సీటింగ్‌తో ఆటో రిక్షాలను అనుమతిస్తున్నారు.
✪ హర్యానాలోనూ రాత్రిపూట కర్ఫ్యూను ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించారు.
✪ ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని 20 పట్టణాల్లో రాత్రిపూట నిషేధాజ్ఞలు విధించారు. రాష్ట్రానికి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి.
✪ ఒడిశాలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంది. దాదాపు 10 పట్టణాల్లో నిషేధాజ్ఞలను అధికారులు అమలు చేస్తున్నారు.
✪ కేరళలో మతపరమైన కార్యక్రమాలపై నిషేధం ఉంది. రాత్రి 9గంటల తర్వాత నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే వారు ప్రభుత్వ పోర్టల్ లో పేరు నమోదు చేసుకొని, పాస్ ఉంటేనే అనుమతిస్తున్నారు.
✪ ఛత్తీస్‌గఢ్: సుకుమా జిల్లాతో పాటు కొన్ని జిల్లాలలో ఏప్రిల్ 19వరకు లాక్ డౌన్ ఉంది. తీవ్ర ఆంక్షల నడుమ ప్రయాణాలు, వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు.
✪ ఉగ్రవాదులు ఎక్కవగా సంచరించే జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో 8 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది.
✪ చంఢీగఢ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం 5గంటల వరకు నగరంలో నిషేధాజ్ఞలున్నాయి. కోవా పంజాబ్ యాప్‌లో పేరు నమోదు చేసుకుంటేనే ప్రయాణాలకు అనుమతి ఇస్తున్నారు.