Monday, November 18, 2024

Breaking: కేసీఆర్ ఎక్క‌డ అడుగు పెడితే.. ఆ ప్రాంతం స‌స్య‌శ్యామ‌లం అవుతోంది: హ‌రీశ్ రావు

ప్రభన్యూస్​ బ్యూరో, ఉమ్మడి మెదక్​: ‘‘పురాణాల్లో రాముడు ఎక్క‌డ కాలు పెడితే అక్కడ రాయి అహ‌ల్య అయ్యిందని విన్నాం.. నేడు సీఎం కేసీఆర్ ఎక్క‌డ అడుగు పెడితే అక్క‌డ ఆ ప్రాంతం స‌న్య‌శ్యామలం అవుతున్న విషయం కనులారా చూస్తున్నాం’’.. అని మంత్రి హ‌రీశ్ రావు కొనియాడారు. సంగారెడ్డి జిల్లా నారాయ‌ణ్‌ఖేడ్‌లో సీఎం కేసీఆర్ ఇవాళ ప‌ర్య‌టించారు. సంగ‌మేశ్వ‌ర‌, బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం నారాయ‌ణ్‌ఖేడ్‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్, మంత్రి హ‌రీశ్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా మాట్లాడిన మంత్రి హ‌రీశ్ రావు.. సంగారెడ్డి జిల్లా చ‌రిత్ర‌లోనే ఇది చిర‌స్థాయిగా నిలిచిపోయే కార్య‌క్ర‌మం అన్నారు.

సంగారెడ్డి జిల్లా అంటేనే తాగ‌డానికి గుక్కెడు నీళ్లు లేని జిల్లా అని.. స‌మైక్య రాష్ట్రంలో ఎవ్వ‌రూ మ‌న గురించి ఆలోచించ‌లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మంత్రి హ‌రీశ్‌రావు. ‘‘ఈరోజు మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు ఇంటింటికీ వ‌స్తున్నాయి. 24 గంట‌ల నాణ్య‌మైన క‌రెంట్ వ‌చ్చింది. రోడ్లు వ‌చ్చాయి. సాగునీరు కూడా రాబోతోంది. మ‌న గురించి సీఎం కేసీఆర్ ఆలోచించి.. 4000 కోట్ల రూపాయ‌ల‌తో 4ల‌క్ష‌ల ఎక‌రాల‌ను సాగునీరు అందించే గొప్ప కార్య‌క్ర‌మానికి శంకుస్థాపన చేశారు. మంజీరాలో వ‌ర‌ద వ‌స్తే ఆనీళ్లు వెళ్లి గోదావ‌రిలో క‌ల‌వ‌డం మ‌న‌కు తెలుసు. కానీ, మ‌న సీఎం గోదావ‌రి నీళ్ల‌ను వెన‌క్కి మ‌ళ్లించి.. మంజీరాలో క‌లిపే అద్భుత‌ కార్య‌క్ర‌మాన్ని క‌ల్పిస్తున్నారు. ఎక్క‌డో 90 మీట‌ర్ల ఎత్తులో ప్ర‌వహిస్తున్న గోదావ‌రి జ‌లాల‌ను మేడిగ‌డ్డ నుంచి మ‌ల్ల‌న్న‌సాగ‌ర్​కు, మ‌ల్ల‌న్న సాగ‌ర్ నుంచి సింగూర్​కు, సింగూర్ నుంచి జ‌హీరాబాద్, నారాయ‌ణ్‌ఖేడ్‌కు అందించ‌బోతున్నారు’’ అని హ‌రీశ్ రావు చెప్పుకొచ్చారు.

కోటి ఎక‌రాల మాగాణిగా మ‌న తెలంగాణ‌ను ఏడేండ్ల కాలంలోనే తీర్చిదిద్దిన ఘ‌న‌త కేసీఆర్‌ది. నేను గ‌తంలో నారాయ‌ణ‌ఖేడ్‌లో ప‌నిచేసిన‌ప్పుడు ఒక సామెత ఉండేది. గోరెంచ‌కు పిల్ల‌నియ్యొద్దు.. హ‌ద్దునూరుకు ఎద్దును ఇవ్వొద్దు అనే సామెత ఉండేది. ఇవాళ మీ ద‌య‌తో మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు వ‌చ్చాయి. దీంతో గోరెంచ‌కు నీళ్లు వ‌చ్చాయి. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్టుల‌తో హ‌ద్దునూరుకు ఎద్దు కూడా ఇస్తారు.. అంటూ మంత్రి హ‌రీశ్ రావు వాడుక‌లో ఉన్న సామెత‌ను గుర్తు చేశారు.

చిమ్నీబాయి అప్ప‌ట్లో చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేసిన హ‌రీశ్ రావు..
చిమ్నీబాయి.. కంగ్టి మండ‌లంలోని స‌ర్దార్ తండ ఆమెది. ఒకసారి ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆ తండాకు వెళ్లా. అప్పుడు ఆమె ఏమ‌న్న‌దంటే ‘‘మా తండాకు ఎవ్వ‌రూ పిల్ల‌ను ఇస్త‌లేరు సార్. మా తండాకు క‌రెంట్ లేదు. మా తండాకు రోడ్డు లేదు. మా తండాకు నీళ్లు లేవు’’ అని చెప్పింది. కానీ.. ఇప్పుడు అన్నీ ఆ తండాకు ఇచ్చారు సార్. దీంతో పిలిచి పిలిచి మా తండాకు పిల్ల‌ను ఇస్తున్నార్ సార్ అని ఇటీవ‌ల ఆ తండాకు మ‌ళ్లీ వెళ్లిన‌ప్పుడు చెప్పింది.. అని మంత్రి హ‌రీశ్ రావు గుర్తు చేశారు. ఇలా ఎన్నో కాదు.. చాలా విజ‌య‌గాథ‌లు ఉన్నాయి. నారాయ‌ణ్‌ఖేడ్‌కు విద్య కోసం 8 రెసిడెన్షియ‌ల్ స్కూళ్లు, 15 స‌బ్‌స్టేషేన్లు తెచ్చుకున్నం. మార్కెట్ యార్డులు వ‌చ్చాయి. 54 తండాల‌ను గ్రామ‌పంచాయ‌తీలుగా చేసుకున్నాం.. అని హ‌రీశ్ రావు స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement