– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు కేటీఆర్. తన చర్యలకు ప్రజలకు క్షమాపణ చెప్పే ధైర్యం ఉందా? అని కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం తొమ్మిది మెడికల్ కాలేజీలను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన గత ట్వీట్ల ఫొటోలను షేర్ చేశారు. వాటిని తన ట్వీట్ ద్వారా తెలియజేస్తూ.. “డియర్ కిషన్ రెడ్డి గారూ, నేను మిమ్మల్ని ఒక సోదరుడిగా గౌరవిస్తాను, కానీ ఇంతకంటే తప్పుడు సమాచారం ఇచ్చే దురదృష్టకరమైన కేంద్ర కేబినెట్ మంత్రిని చూడలేదు. తెలంగాణకు తొమ్మిది మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్టు భారత ప్రభుత్వం ప్రకటించిందని, ఇది పచ్చి అబద్ధమన్నారు. క్షమాపణ చెప్పే ధైర్యం కూడా మీకు లేదు”అని మండిపడ్డారు కేటీఆర్.
హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం హామీని కేటీఆర్ గుర్తు చేస్తూ.. హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటు చేయనున్నట్టు ఆ తర్వాత మీరు ప్రకటించారు. ఎప్పటిలాగే, మీ గుజరాతీ బాస్‌లు దానిని వారి రాష్ట్రానికి మార్చారు. మళ్లీ, మీరు హైదరాబాద్ ప్రజలను తప్పుదారి పట్టించారు. అయినప్పటికీ మీరు మీ తప్పుడు వాదనను సరిదిద్దుకోలేదు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు మంత్రి కేటీఆర్.
ఇక.. కేటీఆర్ ట్విట్ చేస్తూ.. “మీ అరకొర తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తూ, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో వాగ్దానం చేసిన విధంగా బయ్యారంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఆచరణ సాధ్యం కాదని ఇప్పుడు చెప్పడం ప్రారంభించారు. గుజరాత్‌లోని మీ లీడర్లను ప్రసన్నం చేసుకునేందుకు అర్ధసత్యాలు, తప్పుడు వార్తలను ప్రచారం చేసే వ్యక్తి గా మిగిలిపోవద్దు”అని కిషన్‌రెడ్డికి చురకలంటించారు కేటీఆర్.