హైదరాబాద్, ఆంధ్రప్రభ : టాలెంట్ ఉన్నా సరైనా అవకాశాలు లేక చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడంలో వెనుకబడి పోతున్నారు. ఇలాంటి వారికోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి ముందు చూపుతో ఆలోచన చేసి యూనివర్శిటీల్లో కోచింగ్ కేంద్రాలు పెట్టాలని వర్శిటీ వీసీల సమావేశంలో గత ఫిబ్రవరి నెలలో నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్రంలో సాంప్రదాయ కోర్సులను అందించే ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్శిటీల్లో చదివే విద్యార్థుల కోసం కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు నిధులను కూడా మంజూరు చేసింది. ఆరు వర్శిటీలకు కలిపి రూ.18 లక్షలను మంజూరు చేసింది. ఇందులో ఉస్మానియా వర్శిటీకు రూ.5 లక్షలు, కాకతీయ వర్శిటీకు రూ.4 లక్షలు, మిగతా నాలుగు వర్శిటీలకు కలిపి రూ.9 లక్షల నిధులను విడుదల చేసింది. ఈ నిధులను ఫిబ్రవరి నెలలో మంజూరు చేసినట్లు సమాచారం. నిధులు విడుదలై నెలలు గడుస్తున్నా ఇంత వరకూ వర్శిటీల్లో పోటీ పరీక్షలకు సంబంధించిన కోచింగ్ కేంద్రాలు అందుబాటులోకి రాలేదు. అయితే ఒక్క పాలమూరు యూనివర్శిటీ క్యాంపస్‌లో మాత్రం జనవరి నెల నుంచే వర్శిటీ విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ను ప్రారంభించారు. కానీ మిగతా ఐదు వర్సిటీల్లో మాత్రం కోచింగ్ కేంద్రాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఉద్యోగ ప్రకటనలకు ముందే కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలనే డిమాండ్ విద్యార్థుల నుంచి వస్తోంది. ఈ నెలలో గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా వెలువడ నుంది. ఇంకెప్పుడు ఉచిత కోచింగ్‌ను ప్రారంభిస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
ఉస్మానియా వర్శిటీలో సివిల్ సర్వీస్ అకాడమీని స్థాపించబోతున్నారు. మిగతా వర్శిటీల్లో గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన కోచింగ్ కేంద్రా లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇవి అందుబాటులోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, పోలీస్, ఆర్‌ఆర్‌బీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంక్ ఎగ్జామ్స్ ఇతర పోటీ పరీక్షలకు ఏటా లక్షల మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉంటారు. తమ కలల కొలువును సాకారం చేసుకోవడానికి కొందరు రూ.లక్షలు ఖర్చు చేసి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటుంటే… మరి కొందరు మాత్రం కోచింగ్‌కు డబ్బుల్లేక యూని వర్సిటీ లైబ్రరీల్లో స్వతహాగానే ప్రిపేర్ అవుతుంటారు. ఇలాంటి వారికోసం రాష్ట్రంలోని 6 ప్రధాన యూని వర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు కోచింగ్ అందించేందుకు విద్యా మండలి సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. కాకతీయ వర్సిటీ క్యాంపస్‌లో 200 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. శాతవాహన వర్సిటీలోనూ విద్యార్థు లకు అన్ని పోటీ పరీక్షలకు ఉచి తంగా కోచింగ్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే శిక్షణ తీసుకునేందుకు ప్రస్తుతానికైతే ఎలాంటి స్క్రీనింగ్ టెస్టు లేకుండానే విద్యార్థులకు కోచింగ్ ఇవ్వాలని వర్సిటీలు ప్రాథమికంగా నిర్ణ యించినట్లు తెలిసింది. మొదట వర్శిటీలోని విద్యా ర్థులకు కోచింగ్ ఇచ్చిన తర్వాత వర్శిటీ అనుబంధ కాలేజీల్లోని విద్యార్థులకు సైతం కోచింగ్ ఇవ్వనున్నారు. ఒక్కో వర్సిటీలో బ్యాచ్‌కు సుమారు 100 నుంచి 200 మంది విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు వర్శిటీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. వచ్చే దరఖాస్తుల సంఖ్యను బట్టి విద్యార్థులకు బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇవ్వ నున్నారు. సబ్జెక్టులను బోధించేందుకు వర్శిటీ ప్రొఫెసర్లతో పాటు బయటి నుంచి కూడా ప్రత్యేక ఫ్యాకల్టిdని తీసుకొచ్చి విద్యార్థులకు కోచింగ్ ఇప్పించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..