సోషల్ మీడియా అనేది ఇప్పుడు అందరి జీవితాల్లో సాధారణం అయ్యింది.. మహారాష్ట్రలో ఓ బాలిక పెట్టిన స్టేటస్ కొంపలో కుంపటిలా మారింది. ఇరు కుటుంబాల మధ్య హింసాత్మక ఘర్షణకు దారితీసింది. ఈ దాడిలో స్టేటస్ పెట్టిన బాలిక తల్లి తీవ్రంగా గాయపడింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయింది.
చాలా మంది తాము ఏం చేసినా అక్కడి ఫొటోలు తీసి వాటిని వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం చేస్తున్నారు. ఇప్పుడిదంతా కామన్ అయ్యింది. కొంతమంది అయితే… పొద్దున లేచింది మొదలు వాట్సాప్ స్టేటస్లతోనే టైమ్ పాస్ చేస్తుంటారు. అయితే.. ఓ వాట్సాప్ స్టేటస్ రెండు కుటుంబాల మధ్య మంటరేపింది. ఓ బాలిక పెట్టిన స్టేటస్ తనను ఉద్దేశించే పెట్టిందని మరో బాలిక పొరబడింది. ఆ తప్పుడు అభిప్రాయం రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఏకంగా ఒక కుటుంబం మరో కుటుంబం మీదకు దాడి)కి వెళ్లింది. ఈ క్రమంలో ఆవేశాలకు లోనై.. ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఎదురుగా కనిపించిన వారిని చితకబాదారు.
ఈ ఘర్షణలో స్టేటస్ పెట్టిన బాలిక తల్లి తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే తర్వాతి రోజు ఆమె కన్నుమూసింది. ఈ ఘటన మహారాష్ట్ర లోని పాల్‌గడ్‌లో జరిగింది. శివాజీ నగర్‌లో లీలావతి దేవి ప్రసాద్ కుటుంబం నివాసం ఉంటున్నది. లీలావతి దేవీ ప్రసాద్ దంపతులకు ఒక కూతురున్నది. ఆమె తన వాట్సాప్ స్టేటస్‌లో ఓ పోస్టు పెట్టింది. ఈ స్టేటస్ ఆమె ఫ్రెండ్ మరో అమ్మాయికి అభ్యంతరంగా కనిపించింది. అసలు ఆ స్టేటస్ తనను ఉద్దేశించే లీలావతి దేవీ ప్రసాద్ కూతురు పెట్టిందని ఆలోచించింది. తీవ్రంగా మనోవేధనకు గురైంది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో లీలావతి దేవీ ప్రసాద్ కూతురి ఫ్రెండ్ కుటుంబం ఆగ్రహానికి లోనైంది.
ఈ క్రమంలోనే ఫిబ్రవరి 10వ తేదీన శివాజీనగర్‌లోని లీలావతి దేవీ ప్రసాద్ కుటుంబం మీదకు ఆ యువతి, ఆమె సోదరులు, తల్లి దాడికి వెళ్లారు. లీలావతి దేవీ ప్రసాద్ సహా ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ ఘర్షణల్లో లీలావతి దేవీ ప్రసాద్ ఎక్కువ గాయపడింది. ఆమెను సమీపంలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స మొదలు పెట్టారు. కానీ, వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఆమె హాస్పిటల్‌లో చేరిన తర్వాతి రోజే చికిత్స పొందుతూ చనిపోయింది. తన వాట్సాప్ స్టేటస్ చాలా జనరల్‌ది అని, ఎవరినీ ఉద్దేశించి పెట్టలేదని లీలావతి దేవీ ప్రసాద్ కూతురు మీడియాకు తెలిపింది.
ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఇందులో దాడి చేసిన బాలిక తల్లి, మరో ఇద్దరు ఆమె కుటుంబ సభ్యులున్నారు. అయితే, వివాదానికి కారణమైన వాట్సాప్ స్టేటస్‌లో ఏమి పెట్టారో ఇప్పటికీ తెలుపలేదని బోయిసర్ పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ సురేశ్ కాదమ్ వివరించారు.