హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన సిట్ బుధవారం వాటిని హైకోర్టుకు సమర్పించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నందకుమార్, రామచంద్రభారతి ఢిల్లీ పెద్దలతో చేసిన వాట్సాప్ చాట్ సంభాషణ వివరాలను సేకరించి సిట్ దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సమర్పించినట్లు తెలిసింది.
కాగా, ఢిల్లీ పెద్దలతో నిందితులు దిగిన ఫొటోలను కూడా నివేదికలో పొందుపరిచారు. కోర్టుకు సమర్పించిన నివేదికలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బి.ఎల్. సంతోష్‌కు రామచంద్రభారతికి మధ్య జరిగిన సంభాషణ, వీటికి ఇచ్చిన రిప్లయ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు జాబితాలో లేని కీలక పేర్లు, నోటీసులు అందించిన వారి వివరాలు కూడా సిట్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నలుగురు నిందితుల వాట్సాప్ చాట్ వివరాలు కూడా సమర్పించినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.