హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కొత్తగా ప్రారంభమైన లూలు మాల్‌కు జనం పోటెత్తుతున్నారు. దీంతో కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, నిజాంపేట్, జేఎన్టీయూ నుంచి అటు మియాపూర్, ఇటు బాలానగర్ క్రాస్ రోడ్స్ వరకు ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీనికి మాల్ లో కావాల్సిన పార్కింగ్ ఫెసిలిటీ లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా కొత్త మాల్ కావడం, వరుస సెలువులు రావడంతో కూడా జనం పెద్ద ఎత్తున కార్లు, మోటారు బైకులతో తరలివస్తున్నారు. అంతేకాకుండా రోడ్లమీదనే కార్లను పార్క్ చేసి వెళ్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పదుల సంఖ్యలో పోలీసులు ట్రాఫిక్ డ్యూటీ చేసిన ఈ ఏరియాలో కంట్రోల్ కావడం లేదు. దీంతో గంటలకొద్దీ వాహనదారులు, జనం ట్రాఫిక్‌లో ఇరుక్కపోయి ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
ఇక.. మాల్ ఎదురుగా ఉన్న ఫ్లై ఓవర్ మీద, అటువైపు జేఎన్టీయూ రోడ్డు పక్కన వాహనాలను పార్క్ చేస్తుండడంతో కూడా ఇతర వాహనాలు మూవ్ కావడానికి చాన్స్ లేకుండా పోతోంది. ఇదంతా రహదారిపై రాకపోకలు సాగించే ఇతర వాహనదారులకు ఇబ్బందిగా పరిణమిస్తోంది. లులు మాల్ కు జనం పోటెత్తడంతో మియాపూర్ నుండి అమీర్ పేట, JNTU నుండి హైటెక్ సిటీ ప్రయాణించే వాహనదారులు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ తో నరకయాతన అనుభవించారు. ఏకంగా ఫ్లైఓవర్ ల మీదే పార్కింగ్ చేస్తుండడంతో ఈ దారుణ పరిస్థితి ఏర్పడింది.
కూకట్‌పల్లి వై జంక్షన్, బాలానగర్, కూకట్‌పల్లి, JNTU, మియాపూర్ వరకు ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఈ రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణించే వాహనదారులు గంటలకు గంటలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతుండడంతో ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏరియాకి చుట్టుముట్టు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడివక్కడే స్తంభించిపోయాయి. ట్రాఫిక్ సమస్యలను అనుభవించిన కొందరు సామాజిక మాధ్యమాల్లో వారి అనుభవాలను పంచుకుంటున్నారు.
వారిలో కొందరు ట్వీట్ చేస్తూ రెండు కిలోమీటర్ల ప్రయాణానికి తనకు గంటన్నర సమయం పట్టిందంటూ.. సదరు ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో ప్రయాణికుడు ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులును, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ లులు మాల్ రద్దీ కారణంగా NH 65 పై భారీ ట్రాఫిక్ ఏర్పడింది అని అలాగే మెట్రో పిల్లర్ నంబర్ A906 నుండి A713 వరకు తీవ్రమైన ట్రాఫిక్ ఉందంటూ ట్వీట్ చేశారు. అటు ట్రాఫిక్ పోలీసులు సైతం హెవీ ట్రాఫిక్ ని క్లియర్ చేయలేకపోతున్నారు.