Friday, November 22, 2024

సాగర్ పోరు.. నివేదిత దారెటు?

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అయితే, బీజేపీ నాయకురాలు కంకణాల నివేదిత వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి బుధవారం తిరస్కరించారు. దీంతో కంకణాల దంపతుల దారెటు అనే అంశం ప్రస్తుతం చర్చనీయంశమైంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి బీజేపీ తరఫున కంకనాల నివేదిత పోటీ చేశారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల గతేడాది డిసెంబర్‌లో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. సాగర్ టికెట్ తనకే వస్తుందని ఆశించిన నివేదిత.. పార్టీ అభ్యర్థి ప్రకటన కంటే ముందే నామినేషన్ కూడా వేశారు. అయితే, బీజేపీ అనుహంగా రవికుమార్ నాయక్‌కు టిక్కెట్ ఇవ్వడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఆమె కూడా టీఆర్ఎస్‌లో చేరడానికి సిద్దమైనట్లు ప్రచారం కూడా జరిగింది.

అయితే, కంకణాల నివేదిత వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి బుధవారం తిరస్కరించారు. నివేదిత భర్త శ్రీధర్‌రెడ్డి ప్రస్తుతం బీజేపీ జిల్లాధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ టికెట్‌ రాకపోవడం, నామినేషన్‌ తిరస్కరణకు గురవడంతో వీరు ఏ పార్టీ వైపు వెళ్తారోనన్న చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా సాగుతోంది. అయితే, దీనిపై శ్రీధర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. టీఆర్ఎస్ లో చేరే ప్రతిపాదన ఏదీ లేదని, పార్టీ ఆదేశానుసారం పనిచేస్తామని, ప్రచారంలో పాల్గొంటామని శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

మరోవైపు టీఆర్ఎస్ నుంచి నోముల కుమారుడు.. భగత్ కుమార్‌, కాంగ్రెస్‌ నుంచి కుందూరు జానారెడ్డి సాగర్ బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో బీజీగా ఉడడంతో ఇప్పుడు సాగర్ ఉప ఎన్నిక అంశం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement