న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లైనా బీసీల డిమాండ్లను పరిష్కరించకపోగా వారి హక్కులను కాలరాస్తోందని బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. ఇకనైనా కేంద్రం బీసీ వ్యతిరేక వైఖరిని వీడకపోతే ఆగస్టులో లక్షలాది మందితో ఢిల్లీ నగరాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. బుధవారం న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా రాష్ట్రీయ ఓబీసీ మహా సాంగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. 18 రాష్ట్రాల నుంచి వచ్చిన బీసీ సంఘాల ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల ఎంపీలు సంఘీభావం ప్రకటించారు. బీసీ గణన చేయకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, రైతు ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమాన్ని చేపట్టి ఢిల్లీ పాలకులు దిగి వచ్చే వరకు పోరాడుతామని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
దేశంలో ఆరు రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానాలు జరిగినా 22 పార్టీలు మద్దతు ప్రకటించినా ఇంకా కేంద్రం నాన్చివేత ధోరణి అవలంభిస్తోందని విమర్శించారు. బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి కేవలం రూ. 1400 కోట్లు మాత్రమే కేటాయించి అవమానించారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్ రావులు అన్నారు. ఢిల్లీ పాలకులు బీసీల వ్యతిరేకులని, వెనుకబడిన వర్గాలకు ఒరగబెట్టిందేమీ లేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. బీసీలపై విధించిన క్రిమిలేయర్ రద్దు చేసే వరకు రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్‌ను ఎత్తివేసే వరకు కేంద్రంపై బీసీలు యుద్ధం ప్రకటించాలని సూచించారు. బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరిని ఊరూరా తిరిగి ప్రజలకు తెలియజెప్పాలని వీహెచ్ అన్నారు. బీజేపీ అంటే బహుజన వ్యతిరేక పార్టీగా మారిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించే వరకు పోరాటాన్ని ఆపవద్దని టీఆర్ఎస్ పార్టీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఈ మహాధర్నాకు రాష్ట్రీయ ఓబీసీ మహా సంఘ్ జాతీయ అధ్యక్షులు ప్రొఫెసర్ బాబన్ రాం థైవర్డ్ అధ్యక్షత వహించగా ఇంద్ర జిత్ సింగ్ (పంజాబ్), కరుణానిధి (తమిళనాడు), ప్రశాంత్ చౌదరి (గుజరాత్), రాజేష్ షైన్ (హర్యానా), సురేష్ నారాయణ ధనుర్ కార్ (చంద్రపూర్)తో పాటు వివిధ బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు.