ఇది ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య సమాచార మార్పిడికి ఉపయోగించే నెట్‌వర్క్. దీని పూర్తిపేరు సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలీ కమ్యూనికేషన్ (Society for Worldwide Interbank Financial Telecommunication) సంక్షిప్తంగా స్విఫ్ట్ (Swift) అని పిలుస్తారు. ట్రిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా 11,000 కంటే ఎక్కువ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు స్విఫ్ట్ సేవలు అందిస్తుంది. ఇది సురక్షిత సందేశ వ్యవస్థ. త్వరితగతిన సరిహద్దు చెల్లింపులను సులభతరం చేస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఫైనాన్సింగ్ కోసం ప్రధాన యంత్రాంగం. 1973లో బెల్జియంలో స్థాపించబడింది. 200 కంటే ఎక్కువ దేశాల్లోని బ్యాంకులు ఈ వ్యవస్థకు అనుసంధానించ బడివున్నాయి. అధికారికి వెబ్‌సైట్ ప్రకారం ప్రతిరోజు 40 మిలియన్లకు పైగా సందేశాలు పంపబడుతాయి. అదే సమయంలో ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థల మధ్య ట్రిలియన్ డాలర్ల లావాదేవీలు జరుగుతాయి.
ఎలా పనిచేస్తుంది?
సభ్యులైన ప్రతి సంస్థకు బ్యాంకింగ్ ఐడెంటిఫికేషన్ కోడ్ (స్విప్ట్ కోడ్)ను కేటాయిస్తారు. ఉదాహరణకు న్యూయార్క్ లోని ఒక బ్యాంక్ నుంచి లండన్‌లోని ఓ బ్యాంక్‌లో ఖాతా తెరిచి వినియోగదారుడు డబ్బులు తేలిగ్గా పంపవచ్చు. న్యూయార్క్ లోని చెల్లింపుదారుడు తన బ్యాంక్‌కు సొమ్ము చెల్లించి లండన్‌లోని స్వీకర్త బ్యాంక్ స్విప్ట్ నంబర్, ఖాతా వివరాలు ఇవ్వాలి. అప్పుడు న్యూయార్క్ లోని బ్యాంక్ నుంచి లండన్‌లోని బ్యాంక్‌కు స్విప్ట్ సందేశం వెళుతుంది. ఆ తర్వాత లండన్‌లోని బ్యాంక్ నుంచి స్వీకర్తకు సొమ్ము అందుతుంది. స్విప్ట్ మార్గంలో కేవలం సందేశాలను మాత్రమే పంపిస్తుంది. నగదు, ఇతర సెక్యూరిటీలను బదలాయించదు. స్విప్ట్ సంస్థ 2021 లెక్కల ప్రకారం రోజుకు 42మిలియన్ల సందేశాలను పరిశీలిస్తుంది. ఏటా ఈ సంఖ్య 11.4శాతం పెరుగుతోంది. ఐరోపా సమాఖ్య, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలు కలిపి 4.66 బిలియన్ల సందేశాలను పంపుతున్నాయి. ఇక అమెరికా, యూకే 4.42 బిలియన్ల సందేశాలను స్విప్ట్ ద్వారా పంపుతున్నాయి.
దీన్ని ఎవరు నియంత్రిస్తారు?
ఏ ఇతర సంస్థ కూడా దీన్ని డిమాండ్ చేసే స్థాయిలో ఉండదు. కచ్చితత్వం, వేగం, నమ్మకానికి ప్రతీక. పారదర్శకత, వేగాన్ని పెంచడానికి బ్యాంకులు అంగీకరించిన కొత్త నియమావళితో కూడినది. దీన్ని జి-10 సెంట్రల్ బ్యాంకులు (బెల్జియం, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్, బ్రిటన్, అమెరికా, స్విట్జర్లాండ్, స్వీడన్)తోపాటు యూరోపియన్ యూనియన్ సెంట్రల్ బ్యాంక్ పర్యవేక్షిస్తుంది. ప్రధాన పర్యవేక్షకుడి పాత్రరను బెల్జియం నేషనల్ బ్యాంక్ పోషిస్తుంది. 2012లో ఈ ఫ్రేమ్‌వర్క్ సమీక్షించబడింది.
స్విఫ్ట్ ఫోరమ్..
స్విఫ్ట్ ను అభివృద్ధి పరిచే క్రమంలో భాగంగా, ఓవర్‌సైట్ ఫోరమ్‌ను స్థాపించారు. దీనిలో జీ10 సెంట్రల్ బ్యాంకులు ప్రధాన ఆర్థిక వ్యవస్థల నుంచి ఇతర కేంద్ర బ్యాంకులతో చేరాయి. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా రిజర్వుబ్యాంకు, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, హాంకాంగ్ మానిటరీ ఆథారిటీ, రిజర్వు బాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ కొరియా, బ్యాంక్ ఆఫ్ రష్యా, సౌదీ అరేబియా మానిటరీ ఏజెన్సీ, సింగపూర్ మానిటరీ అథారిటీ, ద.ఆఫ్రికా రిజర్వు బ్యాంకు, టర్కీ సెంట్రల్ బ్యాంక్ తదితర బ్యాంకులు అనుసంధానం అయివున్నాయి.