Tuesday, November 26, 2024

Spl Story | పార్లమెంట్​ ‘స్పెషల్​ సెషన్స్’ అంటే ఏమిటి?.. ఏ సందర్భంలో నిర్వహించారు!

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం రెడీ అయ్యింది. ఈనెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనుండగా.. 17న అఖిలపక్ష భేటీ జరగనుంది. అయితే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన కేంద్రం.. సమావేశ ఎజెండాను మాత్రం వెల్లడించలేదు. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఐదు బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి పౌరస్మృతి, జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పు, మహిళా బిల్లు వంటి కీలక బిల్లులు సభ ముందుకు వస్తాయనే ప్రచారం జరుగుతోంది.  ఈ క్రమంలో ఇప్పటి వరకు దేశంలో ప్రత్యేక సమావేశాలు ఎప్పుడు నిర్వహించారు. ఏ సందర్భంలో జరిగాయన్న విషయాలను చదివి తెలుసుకుందాం..

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. నూతన పార్లమెంట్ భవనంలో జరుగనున్న ఈ సమావేశాలకు సంబంధించిన ఎజెండాను తాజాగా లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు వేర్వేరుగా విడుదల చేశాయి. పార్లమెంట్ సమావేశాలు ఉంటాయని ప్రకటించినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అజెండాను విడుదల చేయలేదు. ఎజెండా విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ సోనియా గాంధీ కూడా లేఖ రాశారు. తొలి రోజు పాత పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభమై.. ఆ తర్వాత నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలు కొనసాగించనున్నారు.

తొలి రోజైన 18న జరిగే సమావేశంలో 75 ఏళ్ల భారత పార్లమెంటరీ ప్రస్థానంపై చర్చ జరుగనున్నది. భారత్ సాధించిన ఘనతలు, అనుభవాలు, జ్ఞాపకాలు, నేర్చుకున్న అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆగస్టు 10న కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రించేలా కేంద్రం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. నియామక ప్యానెల్‌లో ప్రధాన మంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర కేబినెట్ మంత్రి ఒకరు ఉంటారని ఆ బిల్లులో పేర్కొన్నారు. అంతే కాకుండా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ)ను దీని నుంచి తొలగిస్తున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. దీంతో ఈ నియమక ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. తాజాగా ఈ బిల్లును ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఈ బిల్లుతో పాటు ముఖ్యమైన మరో నాలుగు బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉన్నది. ది అడ్వొకేట్స్ (అమెండ్‌మెంట్) బిల్లు, ద ప్రెస్ అండ్ రిజస్ట్రేషన్ ఆఫ్ పిరియాడిక్స్ బిల్లుల గురించి కూడా చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఈ బిల్లులను ఆగస్టు 3న రాజ్యసభలో ఆమోదించారు. ఇక ద పోస్టాఫీస్ -2023 బిల్లు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. కాగా, ఈ జాబితా తాత్కాలికమే అని.. మరిన్ని అంశాలను చేర్చే అవకాశం ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. లోక్‌సభలో నాలుగు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుండగా.. రాజ్యసభలో మూడు బిల్లులను ఆమోదింప చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది.

దేశవ్యాప్తంగా ఇటీవల చర్చనీయాంశం అయిన పలు బిల్లులపై మాత్రం కేంద్ర ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉమ్మడి పౌరస్మృతి బిల్లు, దేశం పేరు మార్పు, జమిలి ఎన్నికలు తదితర కీలక బిల్లులపై కేంద్ర ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మంగానే పలు బిల్లుల ప్రస్తావన అజెండాలో తీసుకొని రాలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అవన్నీ రహస్య ఎజెండాలో చేర్చిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణ సమావేశాల్లో కూడా ఆమోదం పొందే ఈ ఏడు బిల్లుల కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏముందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో కూడా తొలుత ప్రస్తావించకుండా పలు బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయిని గుర్తు చేస్తున్నారు. కొన్ని బిల్లులను రహస్య ఎజెండాలో భాగంగా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతున్నది.

అయితే.. ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఏం జరుగుతుందనే దానిపై పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ గందరగోళం మధ్య, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశానికి ఎటువంటి ఎజెండాను నిర్ణయించలేదని ఎత్తి చూపారు. కాగా, 75 ఏళ్ల పార్లమెంట్‌ ప్రయాణంపై నాలుగు బిల్లులు, చర్చలు జరగడంతోపాటు సెషన్‌ కోసం ప్రభుత్వం “తాత్కాలిక జాబితా”ను బుధవారం విడుదల చేసింది. కానీ, ప్రతిపక్షాలు ఈ వివరణపై శాంతించలేదు. పార్లమెంటు ప్రత్యేక సెషన్‌లో ఒక్కసారి మాత్రమే బిల్లుపై చర్చ జరగడం ఆసక్తికరం. అది కూడా ఇటీవల 2017లో జరిగింది. ఈ అర్ధరాత్రి సెషన్ చారిత్రాత్మకమైన GST రోల్‌అవుట్‌తో ముడిపడి ఉంది.

సాధారణంగా, పార్లమెంటరీ సమావేశాల ప్రారంభానికి కొన్ని రోజుల ముందు, ఎజెండాను ప్రతిపాదించడానికి.. అఖిలపక్ష భేటీ జరుగుతుంది. దీనిలో ఒక ఒప్పందానికి రావడానికి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తుంది. సెప్టెంబరు 17న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని, ఈమెయిల్ ద్వారా ఆహ్వానాలు పంపినట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అయితే.. 2017లో జిఎస్‌టి బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఒక్కసారి మాత్రమే లోక్‌సభలో విశ్వాస పరీక్షను నిర్వహించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్​ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు అనే చర్చ అంతటా వినిపిస్తుండగా.. అసలు వీటి గురించిన వాస్తవాలు ఏంటనేదానిపై చాలామందికి అవగాహన లేదు.  ఇప్పటి వరకు ఎన్ని ప్రత్యేక సమావేశాలు జరిగాయి? మరి ఈ ప్రత్యేక సమావేశాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారనే దానిపై క్లారిటీ కోసం కొంత పరిశీలిస్తే.. పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.

పార్లమెంటు ప్రత్యేక సెషన్ అంటే ఏమిటి?

పార్లమెంటు సమావేశాలను నిర్వహించే అధికారాన్ని రాజ్యాంగం ప్రభుత్వానికి ఇచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సెషన్‌ను పిలవాలనే నిర్ణయాన్ని తీసుకుంటుంది. భారత రాజ్యాంగం పార్లమెంట్​కు సంబంధించి ఎక్కడా కూడా “ప్రత్యేక సెషన్” అనే పదాన్ని ప్రస్తావించలేదు. అయితే.. ఆర్టికల్ 85(1)లోని నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రత్యేక సెషన్‌గా పిలిచే ఈ భేటీ కూడా సాధారణ సమావేశాల కిందకు వస్తుంది.

పార్లమెంట్​ సమావేశాల నిర్వహణ ఎలా ఉంటుంది?

పార్లమెంట్​ సమావేశాల నిర్వహణ అనేది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మే 7వరకు బడ్జెట్ సమావేశాలు.. జులై 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వరకు వర్షాకాల సమావేశాలు.. నవంబర్ 5వ తేదీ నుంచి శీతాకాల సమావేశాలు ఉంటాయి.. ఇవి దీపావళి తర్వాత నాలుగో రోజు, ఏది తరువాత అయినా) నిర్వహించాలని 1955లో లోక్‌సభ కమిటీ ప్రతిపాదించింది.  రాజ్యాంగం ప్రకారం రెండు పార్లమెంట్ సమావేశాల మధ్య ఆరు నెలల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు.  

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు అని ఎందుకు పిలుస్తారు?

“ప్రత్యేక సెషన్” అనే పదబంధం రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఉపయోగించలేదు. అయితే ఇది సాధారణంగా ముఖ్యమైన శాసన లేదా జాతీయ ఘటనలను స్మరించుకోవడానికి ఏర్పాటు చేసే భేటీ కాబట్టి ఈ రకంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రిసైడింగ్ అధికారులు ప్రత్యేక సెషన్‌లో ప్రొసీడింగ్‌లను పరిమితం చేయవచ్చు. ప్రశ్నోత్తరాల సమయం వంటి విధానాలను దాటవేయవచ్చు. ఎమర్జెన్సీ ప్రకటనతో వ్యవహరించే ఆర్టికల్ 352 “సభ యొక్క ప్రత్యేక సమావేశం”ని పేర్కొనడం గమనించదగ్గ విషయం.

ఇప్పటి వరకు ఎన్ని ప్రత్యేక సమావేశాలు జరిగాయి..?

భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏడు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరిగాయి. ఏడింటిలో మూడు జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంఘటనలను స్మరించుకోవడానికి ఏర్పాటు చేశారు. ఇందులో రెండు తమిళనాడు, నాగాలాండ్ (1977) , హర్యానా (1991)లో రాష్ట్రపతి పాలన విషయంలో మరో రెండు భేటీలు జరిగాయి. మిగిలిన రెండింటిలో 2008లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశ్వాస పరీక్షను నిర్వహించడానికి ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక… ఇండో-అమెరికా అణు ఒప్పందంపై నాలుగు వామపక్ష పార్టీలు (60 మంది ఎంపీలతో) ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో విశ్వాస ఓటుతో UPA ప్రభుత్వం మనుగడ సాగించింది. సమాజ్‌వాదీ పార్టీ మద్దతును కూడగట్టుకుని దానికి అనుకూలంగా 275 ఓట్లు పొందగా, 256 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు.

2017లో జరిగిన చివరి ప్రత్యేక సమావేశాన్ని కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్వహించింది. జూన్ 30, 2017న, NDA ప్రభుత్వం భారీ పరోక్ష పన్ను సంస్కరణ అయిన వస్తు సేవల పన్ను (GST)ని అమలు చేయడానికి సెంట్రల్ హాల్‌లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఎంపీలు, ముఖ్యమంత్రులు, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు సహా దాదాపు 600 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక.. సెప్టెంబరు 18 నుండి 22 వరకు నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాన్ని మోడీ ప్రభుత్వం రెండవది కాని తిరిగి ఎన్నికైన తర్వాత మొదటిది.

అయితే ఈ ప్రత్యేక సమావేశాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు?

లోక్‌సభలో చేపట్టాల్సిన రెండు బిల్లులు, రాజ్యసభలో మరో రెండు బిల్లులతో కూడిన పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల ఎజెండాకు సంబంధించిన ‘తాత్కాలిక జాబితా’ను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. అధికారిక పార్లమెంటరీ వ్యవహారాలతో పాటు, ’75 ఏళ్ల పార్లమెంటరీ జర్నీ’ అనే అంశంపై చర్చ జరుగుతుంది. శీతాకాల సమావేశాల వరకు వేచి ఉండాల్సిన శాసనసభ వ్యవహారాల కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారనే సందేహాన్ని కాంగ్రెస్ లేవనెత్తింది. “ప్రస్తుతం వెల్లడించిన ఎజెండా చాలా గందరగోళంగా ఉంది. – ఇవన్నీ నవంబర్‌లో జరిగే శీతాకాల సమావేశాల వరకు వేచి ఉండవచ్చు. పర్దే కే పీచే కుచ్ ఔర్ హై!” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు.

కాగా, అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా నవంబర్-డిసెంబర్లో జరిగే శీతాకాల సమావేశాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వం సెప్టెంబర్ సెషన్‌ను నిర్వహిస్తోందని కొంతమంది బీజేపీ నాయకులు అంటున్నారు. ఇక.. ఈ ప్రత్యేక సమావేశంలో ఎంపీలు కొత్త పార్లమెంటు భవనంలోకి మారనున్నారు. పాత పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభమై ఆ మరుసటి రోజు కొత్త భవనానికి షిఫ్ట్​ అవుఆయని అధికారులు తెలిపారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement