ఉక్రెయిన్‌పై రష్యా వార్ చేస్తున్న క్రమంలో నాటో అనే అంశం చర్చల్లోకి వస్తోంది. అమెరికా ఉక్రెయిన్ను నాటోలో చేరాలని కోరిందని, దీంతో రష్యా దానికి ఒప్పుకోవడం లేదని అనలిస్టులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌కు ఎవరు సాయం చేసినా వారి అంతం చూస్తానని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇంతకీ నాటో అంటే ఏమిటి.. నాటోలో చేరడం వల్ల ఎట్లాంటి ప్రయోజనాలుంటాయి.. రష్యా ఎందుకు వద్దని వారిస్తోంది.. అన్న విషయాలు తెలుసుకుందాం.. నాటో అంటే.. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్.. అయితే ఈ నాటో సభ్య దేశాల్లో ఏ దేశంపైన దాడి జరిగినా అన్ని దేశాలపై దాడి జరిగినట్టు పరిగణిస్తారు. అభివృద్ది, సుస్థిరత, ప్రజా శ్రేయస్సు, సభ్య దేశాల స్వాతంత్ర్యం, నాగరికతను కాపాడడం వంటివి నాటో దేశాలు ఏర్పరుచుకున్న కీలక ఒప్పందాలు.. ప్రస్తుతం నాటో పరిధిలో 30 దేశాలున్నాయి.
ప్రచ్ఛన్న యుద్ధం తొలి దశల్లో 1949లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)ను సభ్య దేశాల ఉమ్మడి రక్షణకు ఒక రాజకీయ, సైనిక కూటమిగా నెలకొల్పారు. డెబ్బై ఏళ్ల తర్వాత ఎంతో మారిపోయిన భద్రతా ప్రాధామ్యాలు అత్యంత విభిన్నంగా ఉన్న ప్రపంచంలో దీనికి ఇంకా ప్రాధాన్యం ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో నాటోలో అంతర్గత వాతావరణం సామరస్యంగా లేదు. సంస్థను గురించి, ఇతర సభ్య దేశాల గురించి అమెరికా, ఫ్రాన్స్, టర్కీలు బాహాటంగానే విమర్శలు చేస్తున్నాయి. చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక కూటమిగా దీన్ని సమర్థించేవారు చెబుతున్నా.. నాటో భవిష్యత్తుపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నాటో ఎలా రూపొందిందంటే..
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ను నిలువరించడం ప్రధాన లక్ష్యంగా పది ఐరోపా దేశాలతో పాటు అమెరికా, కెనడా సభ్య దేశాలుగా నాటో ఏర్పాటైంది. అప్పటి యుద్ధంలో ఒక విజేతగా ఆవిర్భవించిన తర్వాత సోవియట్ సైనిక బలగాలు పెద్ద సంఖ్యలో తూర్పు యూరప్‌లోనే కొనసాగాయి. తూర్పు జర్మనీ సహా పలు దేశాలపై రష్యా బలమైన ప్రభావం చూపింది. యుద్ధం తర్వాత జర్మనీ రాజధాని బెర్లిన్ను విజేతలు ఆక్రమించారు. 1948 మధ్యలో సోవియట్ అధినేత జోసెఫ్ స్టాలిన్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ల నియంత్రణలో ఉన్నప్పటికీ పూర్తిగా తూర్పు జర్మనీ పరిధిలోనే ఉన్న పశ్చిమ బెర్లిన్‌కి వ్యతిరేకంగా దిగ్బంధం మొదలుపెట్టారు.
నగరంలోకి వాయుమార్గంలో సైనిక బలగాలను పంపించడం వల్ల ముఖాముఖి ఘర్షణ జరగలేదు. కానీ, ఆ సంక్షోభం వల్ల సోవియట్ శక్తికి వ్యతిరేకంగా ఒక కూటమి రూపకల్పన కావాల్సి వచ్చింది. 1949లో అమెరికా మరో 11దేశాలు (బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, నార్వే, బెల్జియం, డెన్మార్క్, నెదర్లాండ్స్, పోర్చుగల్, ఐస్‌ల్యాండ్, లక్సెంబర్గ్) కలిసి ఒక రాజకీయ, సైనిక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ సంస్థ 1952లో గ్రీస్, టర్కీలను చేర్చుకుని మరింత విస్తరించింది. 1955లో పశ్చిమ జర్మనీ కూడా దీనిలో చేరింది. 1999 నుంచి మాజీ తూర్పు కూటమి (ఈస్ట్రన్ బ్లాక్) దేశాలు కూడా ఇందులో చేరాయి. మొత్తం సభ్య దేశాల సంఖ్య 29కి పెరిగింది. తాజాగా 2017 జూన్‌లో మాంటెనిగ్రో కూడా నాటో భాగస్వామిగా మారింది.
ఈ నాటో ఎందుకంటే..
నాటో అధికారికంగా చెబుతున్న ప్రకారం.. ‘‘ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో సుస్థిరత, శ్రేయస్సును పెంపొందించటం ద్వారా సభ్య దేశాల స్వాతంత్ర్యం, ఉమ్మడి వారసత్వం, నాగరికతలను సంరక్షించటం’’.. అనేవి కీలకాంశాలు. అదేవిధంగా నాటో సభ్య దేశాల్లో ఏదో ఒక దేశం మీద సాయుధ దాడి జరిగితే.. దాన్ని తమందరి మీదా దాడిగా పరిగణించటం జరుగుతుందని, అందరూ పరస్పర సాయం కోసం ముందుకు వస్తారని నాటో ఒప్పందం స్పష్టంచేస్తోంది.
సోవియట్ రష్యా లేనపుడు.. నాటో ఇంకా ఎందుకుంది..
ప్రచ్ఛన్న యుద్ధం, సోవియట్ యూనియన్ ముగియటంతోనే రష్యా గురించి పశ్చిమ దేశాల ఆందోళన తొలగిపోలేదు. ‘‘కమ్యూనిజం అదృశ్యమవటం వల్ల మిత్రదేశాలు సాయుధ బలగాలు లేకుండా, రక్షణ లేకుండా జీవించగలిగే ఒక స్వర్ణయుగం సృష్టి జరిగిందని అకస్మాత్తుగా ఎవరూ నమ్మలేదు’’ అని నాటో ఉన్నతాధికారి ఒకరు జేమీ షియా 2003 ప్రసంగంలో చేసిన వ్యాఖ్య చాలా ప్రాచుర్యం పొందింది. రష్యా సైనికపరంగా శక్తివంతంగానే కొనసాగటంతో పాటు.. యుగోస్లోవియా కుప్పకూలటంతో 1990లలో యూరప్‌లో యుద్ధం వచ్చింది. దానిని అనుసరించి తలెత్తిన సంఘర్షణలతో.. నాటో తన పాత్రను మార్చుకుంది. మరింతగా జోక్యం చేసుకునే సంస్థగా మారింది. బోస్నియా, కొసావాల్లో సెర్బియా దళాలలకు వ్యతిరేకంగా వైమానిక దాడులు, నౌకా దిగ్బంధంనం, శాంతి పరరక్షణ బలగాల వంటి సైనిక కార్యకలాపాలు చేపట్టింది.
2001లో నాటో మొదటిసారిగా తన కార్యకలాపాలను యూరప్ వెలుపలకు తీసుకెళ్లింది. సెప్టెంబర్ 11 దాడుల అనంతరం అఫ్ఘానిస్తాన్‌కు పంపించిన ఐక్యరాజ్యసమితి సంకీర్ణ బలగాల వ్యూహాత్మక నాయకత్వాన్ని నాటో స్వీకరించింది. అఫ్ఘాన్ భద్రతా దళాలకు శిక్షణనివ్వటం,సలహాలివ్వటం, సాయపడే కార్యక్రమంలో భాగంగా.. ఆ దేశంలో ఈ రోజుకీ నాటో నాయకత్వం కింద దాదాపు 17,000 మంది సైనికులు కొనసాగుతూనే ఉన్నారు.