Saturday, November 23, 2024

Big Story: రాష్ట్రపతి ఎన్నికలో కేసీఆర్‌ వ్యూహం ఏంటీ?.. కేసీఆర్‌, కేజ్రీవాల్‌ అడుగులు ఎటువైపు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర్‌రావు వ్యూహంపై జాతీయ స్థాయిలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో గులాబీ దళపతి ఎటువైపు మొగ్గు చూపుతారో అర్థంకాక విపక్ష పార్టీలు తలలు పట్టుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలను కూడగట్టి బలమైన ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ బుధవారం ఢిల్లిdలో నిర్వహించిన సమావేశానికి కేసీఆర్‌ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

దీంతో ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ వైఖరి ఎలా ఉండబోతోందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ భేటీకి మమత 22 పార్టీల నేతలను ఆహ్వానించగా ఆరు పార్టీలు గైర్హాజరయ్యారు. ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లిd ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ సమావేశానికి వెళ్లడం లేదని ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు మూడు రోజుల క్రితమే ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికకు నిర్వహిస్తున్న ముఖ్య సమావేశానికి వెళ్లాలా, వద్దా అనే అంశంపై సీఎం కేసీఆర్‌ పార్టీ ముఖ్యులు, పలువురు మంత్రులు, కీలక నేతలతో బుధవారం రోజంతా చర్చోపచర్చలు సాగించి చివరికి తాను కానీ, పార్టీ తరఫున ప్రతినిధులు కానీ హాజరు కాకూడదని నిర్ణయించారు.

కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలతో సమాన దూరాన్ని పాటిస్తామని, ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెరాసపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి బాజపాపై ఒక్క ఆరోపణ కూడా చేయలేదని ఈ పరిస్థితిలో మమతా బెనర్జీ నిర్వహిస్తున్న ఈ సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీతో కలిసి వేదికను పంచుకోవడం కుదరదన్న అభిప్రాయాన్ని కేసీఆర్‌ వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో పార్టీలంతా సమావేశమై ఎవరిని బరిలోకి దింపాలన్న అంశంపై చర్చించి తుది నిర్ణయానికి వచ్చాక సదరు అభ్యర్థులతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని అలా కాకుండా ముందు అభ్యర్థిని ఖరారు చేసి పార్టీల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించడంలో అర్థం లేదని తెరాస అంటోంది.

మమతా బెనర్జీ నిర్వహిస్తున్న సమావేశానికి వెళ్లకపోవడం వెనక నాలుగు ప్రధాన కారణాలున్నాయని కూడా ఆ పార్టీ చెబుతోంది. తమకు తాము జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌, బాజపాల విషయంలో ఇది వరకే తమ పార్టీ వైఖరి స్పష్టం చేశామని ఈ రెండు పార్టీలకు చేరువ కాకూడదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెరాస నేతలు చెబుతున్నారు. ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్న మమతా బెనర్జీకి కూడా ఈ విషయాన్ని ఇప్పటికే చెప్పామని అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీని ఈ భేటీకి ఆహ్వానించడంపై తమకు అభ్యంతరం ఉందని చెబుతున్నారు.

తెలంగాణలో తెరాసకు ప్రధాన పోటీ కాంగ్రెస్‌ అని ఏ స్థాయిలోనూ ఈ పార్టీతో కలిసి ముందుకు సాగేందుకు అవకాశం లేదని తెరాస కుండబద్ధలు కొడుతోంది. రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌ వచ్చి తెరాసపై అసత్య ప్రచారం చేసి వెళ్లారని బాజపాను పల్లెత్తు మాట అనలేదని అందుకే కాంగ్రెస్‌తో కలిసి అడుగులు వేసేందుకు తాము సిద్ధంగా లేమని తెరాస స్పష్టం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్‌, బాజపాలు కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నారని గత లోక్‌సభ ఎన్నికలు మొదలుకొని ఇటీవల జరిగిన హుజురాబాద్‌ ఎన్నిక దాకా ఇదే కొనసాగిందని తెరాస ఆరోపిస్తోంది.

- Advertisement -

హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డిపాజిట్‌ కోల్పోయి బాజపాను గెలిపించే ప్రయత్నం చేసిందని అటువంటి కాంగ్రెస్‌ను విశ్వసించే అవకాశమే లేదని తెగేసి చెప్పింది. రాష్ట్రపతి వంటి కీలకమైన ఎన్నికలో విపక్ష నేతలంతా కలిసి కూర్చుని ఎవరికీ ఇబ్బంది కలిగించని, అందరికి ఆమోదయోగ్యమైన ఏకాభిప్రాయ అభ్యర్థిపై తొలుత చర్చిస్తారని ఆ తర్వాత అభ్యర్థితో సంప్రదింపులు జరిపి ఒప్పించే ప్రయత్నం జరుగుతుందని ప్రస్తుతం ఇందుకు భిన్నంగా వ్యవహారం నడుస్తోందని తెరాస ఆరోపించింది. ఈ కారణాల వల్లే మమతా బెనర్జీ నిర్వహిస్తున్న సమావేశానికి వెళ్లడం లేదని స్పష్టం చేసింది.

గులాబీ బాస్‌ అడుగులు ఎటువైపు?
బాజపా అగ్రనేతలు రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఒకవైపు పావులు కదుపుతుండగా మరోవైపు మమతా బెనర్జీ విపక్ష పార్టీలను కూడదీసి ప్రత్యర్థిగా మరో అభ్యర్థిని ఎంపిక చేసేందుకు రంగం సిద్ధం చేసింది. కాంగ్రెస్‌, బాజపాలతో సమదూరం పాటిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది తెరాసలో చర్చ జరుగుతోంది. మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశానికి దూరంగా ఉన్న పార్టీలతో చర్చించి మరో వేదికను ఏర్పాటు చేస్తారా లేక రాష్ట్రానికి అన్ని విధాలా నష్టం చేకూర్చిన బాజపాను ఎండగడుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంటా ఉంటారా లేక ఈ ఎన్నికను బహిష్కరిస్తారా అనే అంశంపై రాజకీయ విశ్లేషకులు తమకు తాము తోచిన విధంగా చర్చలు జరుపుతున్నారు.

రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి బుధవారం నోటిఫికేషన్‌ వెలువడిందని రెండు మూడు రోజుల్లో రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన చేస్తారని ఆ పార్టీకి చెందిన నేతలు చెబుతున్నారు. సీఎం కేసీఆర్‌ ఇటీవల బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఢిల్లిd వెళ్లి అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతిగా కాంగ్రెస్‌ పార్టీ మినహా విపక్ష పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయాలని అన్ని పార్టీలు ఒక నిర్ణయానికి వస్తే అందుకు మద్దతు ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా చేసిన ప్రతిపాదనకు వీరు అంగీకారం తెలిపినట్టు సమాచారం.

దేవెగౌడ, కుమారస్వామి, అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా కాంగ్రెస్‌, బాజపాలతో సమదూరాన్ని పాటించాలన్న నిర్ణయానికి అప్పటికే వచ్చారని తెరాస వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తెరాస అధినేత కేసీఆర్‌ రాష్ట్రపతి ఎన్నిలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది హాట్‌ టాపిక్‌గా మారింది. ఒకటి, రెండు రోజుల్లో జరిగే పరిణామాలను బేరీజు వేసుకుని రాష్ట్రపతి ఎన్నికపై తగు నిర్ణయం ప్రకటిస్తారని తెరాసకు చెందిన ముఖ్య నేతలు చెప్పారు. కాగా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు సంబంధించి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరుపై రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టేందుకు ముందు పార్టీల ముఖ్య నేతలందరినీ ఆహ్వానించి వారితో సమాలోచనలు జరపాలని అప్పుడే అభ్యర్థి ఎంపికపై ఒక నిర్ణయానికి రావాలని అంటున్నారు. అలా కాకుండా ముందే అభ్యర్థిని ప్రతిపాదించి ఆ తర్వాత పార్టీల నేతలను పిలిచి చర్చలు జరపడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని రాజకీయ పండితులు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement