హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రముఖ యూట్యూబర్, జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి గచ్చిబౌలిలో నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. హోలీ వేడుకల్లో పాల్గొన్న అనంతరం స్నేహితుడు రోహిత్‌తో కలిసి సైబరాబాద్ పరిధిలోని విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా ఓ కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పై బోల్తా పడటంతో గాయత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో రోహిత్‌కు తీవ్ర గాయాలవడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హోలీ పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి వేడుకలు చేసుకున్న ఆమె రాత్రి ప్రిజమ్ పబ్ నుంచి స్నేహితుడు రోహిత్‌తో కలిసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
గాయత్రిపబ్‌కు వెళ్లారా, వెళ్తే నిబంధనలకు విరుద్ధంగా పబ్ చేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హోలీ సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లు, పబ్లను పోలీసులు మూసివేయించారు. నిబంధనలు పాటించకుండా పబ్ ఎలా తెరిచారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వేడుకలను ముగించుకున్న అనంతరం ఇద్దరు పబ్‌కు వెళ్లారా.. మద్యం సేవించిన తర్వాతనే ప్రమాదం జరిగిందా? అనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నటి గాయత్రి ప్రయాణిస్తున్న కారు ప్రమాదం జరిగిన సమయంలో 120 కిలోమీటర్లకుపైగా వేగంతో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. కారు ఫుట్‌పాత్‌ను ఢీకొన్న వెంటనే బోల్తా పడటంతో ప్రమాదం ధాటికి లోపల ఉన్న రోహిత్, గాయత్రి బయటకు ఎగిరిపడ్డట్లు స్థానికులు చెబుతున్నారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
కొబ్బరిబొండంలో మద్యం సేవించి..
హోలీ వేడుకలను ముగించుకున్న గాయత్రి తన మిత్రుడు రోహిత్‌తో కలిసి పబ్‌కు వెళ్ళారని, అక్కడ మద్యం సరఫరాపై నిషేధం ఉండటంతో కొబ్బరి బొండంలో మద్యం తాగారని అంటున్నారు. అయితే పబ్ తెరిచి ఉందా? ఉంటే కారణాలేమిటి అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా పబ్ పరిసరాలలోని సీసీ కెమెరాలతో పాటు పబ్ లోపలి సీసీ కెమెరాలలోని పుటేజీని పరిశీలిస్తున్నారు. వాస్తవానికి పబ్ తెరచే ఉందా, ఇద్దరూ అక్కడే మద్యం సేవించారా? లేక మరోచోట పార్టీ చేసుకున్నారా అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు.