Saturday, November 23, 2024

‘ఏం పోషవ్వ టీకాలు వేసుకున్నవా’.. ఫీవ‌ర్ సర్వేలో మంత్రి హరీష్ రావు ఆరా!

ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి మెదక్ : ‘‘ఏం పోశ‌వ్వ‌, ఎట్లున్న‌వ్‌.. పానం మంచిగున్న‌దా.. టీకా తీసుకున్న‌వా.. లేదా..’’ అంటూ వైద్య ఆరోగ్య మంత్రి హ‌రీశ్ రావు మ‌హిళ‌ల‌ను, వృద్ధుల‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ ఫీవ‌ర్ స‌ర్వేలో పాల్గొన్నారు. శ‌నివారం ఉద‌యం సిద్దిపేట టౌన్‌ 37వ వార్డులో ఈ స‌న్నివేశం క‌నిపించింది. డీఎంఎచ్ఓ, మున్సిపల్ అధికారులతో కలిసి మంత్రి వార్డులో కలియతిరిగారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. కొంత మంది వృద్ధులు సూదికి భయపడి ఒకటే డోస్ వేసుకుంటే.. ఇంకొంత మంది మొదటి డోస్ వేసుకున్నాక ఒళ్లు నొప్పులు, జ్వరం రావడంతో రెండో డోస్ జోలికి పోలేదు. కొందరికేమో బూస్టర్ డోస్ పై అస్సలు అవగాహన లేకపోవటంతో అట్లాంటి వారిని ఆప్యాయంగా పేరు, పేరున పలుకరిస్తూ టీకాల విష‌యంపై మంత్రి హరీశ్ రావు ఆరా తీశారు.

‘‘నేను ఉన్నాను.. నేనే ఆరోగ్య శాఖ మంత్రిని.. నీ కేమి కాదు, నీకేమైనా ఐతే నాది బాధ్యత’’ అంటూ వారికి అవగాహన కల్పించి 37వ వార్డు అంతా కలియతిరిగి వాక్సిన్ వేసుకొని వారికి దగ్గరుండి వేయించడంతో సర్వత్రా అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా స్థానికులకు, మంత్రి హరీశ్‌రావుకు మధ్య జరిగిన సంభాషణ ఇలా సాగింది.

హరీష్ రావు: ఏం పోషవ్వా ఎన్ని టీకాలు వేసుకున్నావు
పోశవ్వ: ఒకటే ఏసుకున్న సారు
హరీష్ రావు: ఎందుకని తల్లి
పోషవ్వ: సూది మందు అంటే కొంత జంకు సారు
హరీష్ రావు: సూదికి బయపడుతావా తల్లి.. నేనున్నాలే నీకేమి కాదు వేసుకో
పోషవ్వ: అట్లనే సారు

- Advertisement -


హరీష్ రావు: ఎం దేవమ్మ ఆరోగ్యం ఎట్లుంది..
దేవమ్మ: సారు మంచిగుంది
హరీష్ రావు: టీకాలు వేసుకున్నావ తల్లి
దేవమ్మ: ఆఁ.. వేసుకున్న సారు
హరీష్ రావు: బూస్టర్ డోస్ వేసుకున్నావ తల్లి
దేవమ్మ: మొన్ననే మున్సిపల్ పెద్దసార్లు మా అందరికీ వేయించిండ్రు సారు
హరీష్ రావు: సల్లంగ ఉండు తల్లి

దేవమ్మతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు

ఓ ఇంటి గేటుముందు ఆగిన మంత్రి అక్కడున్నవారితో మాటా మంతీ..
హరీష్ రావు: ఎం అమ్మ మీ ఇంట్లో అందరూ టీకాలు వేసుకున్నార
రేణుక : మా ఇంట్లో అందరూ వేసుకున్నారు సర్
హరీష్ రావు: ఈ ముసలమ్మఏం అయితది మీకు
రేణుక : మా అమ్మ సారు
హరీష్ రావు: ఎన్ని డోసుల టీకా తీస్కుంది
రేణుక: రెండు సారు
హరీష్ రావు: అధికారులారా ఈ అమ్మకు మూడో డోస్ వేయండి అని చెప్ప‌డంతో.. అక్కడికక్కడే మూడో డోస్ వేశారు. మొత్తానికి హరీశ్‌ రావు పర్యటన ఆసక్తికరంగా మారగా రెండో డోస్ తీసుకొని వారికి అక్కడికక్కడే రెండవ డోస్ వేయించారు. బూస్టర్ డోస్ పై అవగాహన లేని వారికి అవగాహన కల్పించి టీకా వేయించి మనోదైర్యం నింపారు.

గృహిణి రేణుకతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు, ఫీవర్ సర్వేలో పాల్గొన్న జిల్లా అధికారులు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement