కర్నాటకలోని ఉడిపి జిల్లాలో హిజాబ్, శాఫ్రాన్ వివాదం చెలరేగింది. MGM కాలేజీకి హిజాబ్‌లు ధరించి స్టూడెంట్స్ రావడంపై తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. దీంతో హిజాబ్‌లు ధరించిన అమ్మాయిలను చూసి ఇతర విద్యార్థులు నిరసన చేపట్టారు. ప్రతిగా శాఫ్రాన్ కలర్లో శాలువాలు ధరించి వచ్చారు, ఇట్లా రెండు గ్రూపులు కళాశాల వెలుపల భారీ ప్రదర్శన నిర్వహించాయి. హిజాబ్ వ్యతిరేక నిరసనకారుల ప్రదర్శనలో ‘జై శ్రీరామ్’ నినాదాలు కూడా మిన్నంటాయి. దీంతో ఏం చేయాలో తెలియక కళాశాల ప్రిన్సిపాల్ ఏకంగా సెలవు ప్రకటించారు.
చిన్నప్పటి నుంచి ఇలాంటి డ్రెస్‌లతోనే మేము స్కూల్‌కి, కాలేజీకి వస్తున్నాము. అప్పడు లేని ఇబ్బంది ఇప్పుడే ఎందుకొచ్చింది. హిజాబ్‌లు ధరించడం మాకు అలవాటుగా మారింది. ఇవి లేకుండా మేము బయటికి రాలేము అని తస్మియా అనే స్టూడెంట్స్ తెలిపింది. కొద్ది రోజులుగా నిరసన తెలుపుతున్న మా తోటి విద్యార్థులు శాఫ్రాన్ ధరించడం ప్రారంభించారని ఆమె అన్నారు. ఇప్పుడు వారు కూడా శాలువాలు ధరించాలని మాకు చెబుతున్నారు. మేము హిజాబ్ ధరించ వద్దని అధికారులు చెబితే వేరే కాలేజీకి వెళ్లి ఉండేవాళ్లం. అని స్పష్టం చేసింది. అంతేకాకుండా మాకు వచ్చే వారం పరీక్షలున్నాయి. మేము బాగా చదువుకోవాలనుకుంటున్నాము. కానీ, బయట చూస్తే ఇలా నిరసనలు చేస్తున్నారు. అని ఆ బాలిక వాపోయింది.
ఇంతలో మరో అమ్మాయి మాట్లాడుతూ.. మమ్మల్ని ప్రాక్టికల్ పరీక్షలు రాయనివ్వకుండా అడ్డుకుంటున్నారు. పరీక్షలు రాస్తుంటే బయటకు రమ్మని చెప్పారు. పరీక్షలు రాయాలంటే హిజాబ్‌లు లేకుండా రావాలని చెబుతున్నారు. వార్షిక పరీక్షల సమయంలో ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు? అని ప్రశ్నించింది. కాగా, హిజాబ్‌లు ధరించి ఎవరినీ లోపలికి అనుమతించబోమని కళాశాల అధికారులు చెప్పారు. కానీ, ఈరోజు వారిని లోపలికి అనుమతించారు. కాబట్టి మేము దీనికి వ్యతిరేకంగా శాఫ్రాన్ శాలువాలు ధరించి బయట నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నాం అని మరో వర్గానికి చెందిన బాలికి తెలిపింది.
కర్నాటక హైకోర్టు ఈ సమస్యపై నిర్ణయం తీసుకునే వరకు ఎవరూ తరగతులకు, పాఠశాలకు హిజాబ్‌లు ధరించి రాకూడదు. మా నిరసన మతపరమైన అంశాలకు వ్యతిరేకం కాదు. మాకు సమానత్వం కావాలి. మేము పరీక్ష సమయంలో మా తరగతులను కోల్పోతున్నాం.. మా చదువులు దెబ్బతింటున్నాయి అని మరొక హిజాబ్ వ్యతిరేక నిరసనకారుడు తెలిపాడు.