బెంగాల్ లో త్వరలో జరిగే ఉప ఎన్నికల బరిలో సీఎం మమతా బెనర్జీ దిగబోతున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. నందిగ్రామ్ నుంచి బరిలో దిగిన మమత తన ప్రత్యర్థి సువేందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే, ఆమె సీఎంగా కొనసాగాలంటే ఎమ్మెల్యేగా గెలవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో తనకు కంచుకోట అయిన భబానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా సువేందు అధికారితో సవాల్ చేసిన కారణంగా ఆమె నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. భవానీపూర్ నుంచి టీఎంసీ అభ్యర్థి శోభన్ దేబ్ ఛటోపాధ్యాయ్ పోటీచేసి గెలిచారు. అయితే నందిగ్రామ్ లో ఓటమిపాలైనా… తృణమూల్ పార్టీ అత్యధిక సీట్లు గెలవడంతో మమతనే మళ్లీ సీఎం అయ్యారు. ఆమె మే 5న సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. 6 నెలల లోపు ఎమ్మెల్యేగా గెలిస్తేనే సీఎం పదవిలో కొనసాగేందుకు వీలుంటుంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ మళ్లీ పోటీచేసేందుకు వీలుగా భబానీపూర్ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే శోభన్ దేబ్ త్యాగం చేశారు. ఆయన రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
కాగా, భవానీపూర్ తో పాటు మరో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం శనివారం ప్రకటన జారీ చేసింది. ఈ నెల 30న భబానీపూర్, షంషేర్ గంజ్, జాంగీర్ పూర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనుంది. అలాగే ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా అదే రోజున ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. కాగా, తెలంగాణలోని హుజురాబాద్, ఏపీలో బద్వేల్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల వాయిదా పడింది.