హైదరాబాద్, ఆంధ్రప్రభ : అసెంబ్లి ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలకు మేలు చేసే అంశాలపై భారతీయ జనతాపార్టీ దృష్టి సారించింది. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి దోహదపడే అంశాలను గుర్తించి పూర్తిస్థాయి నివేదిక రూపొందించి ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను టీఎస్‌పీ ఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అప్పగించారు. తక్షణమే వివిధ రంగాల నిష్ణాతులతో సమావేశమై అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి దోహదపడే అంశాలను గుర్తించాలని ఆదేశించారు. బండి సంజయ్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ కమిటీ పని ప్రారంభించింది. రైతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజల పక్షాన నిలబడి బండి అనేక సమస్యలపై పోరాటాలు చేయడమే కాకుండా జైలుకు కూడా వెళ్లి రావడంతో రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంపై పూర్తిస్థాయిలో సమస్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది.
ప్రధానంగా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ 57 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి తెలంగాణ నలుమూలలా అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టిన విషయం తెలిసిందే. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా దాదాపు 18 భారీ బహిరంగసభలను బండి నిర్వహించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు ఆసభలకు హాజరయ్యారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, పేదలకు ఇళ్లు నిర్మిస్తామని, ఏటా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ కేలండర్‌న పు ప్రకటిస్తామని, రైతులకు ఫసల్ బీమా అమలు చేస్తామని ప్రకటించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సాధికారత తదితర అంశాలపై ఆయా రంగాల్లో నిష్ణాతులైన మేథావుల తో చర్చించి సమగ్ర రోడ్ మ్యాప్‌ను తయారు చేసి పూర్తిస్థాయి నివేదికను పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సమర్పించనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు నేటి సాయంత్రం హైదరాబాద్‌లో బీసీ సబ్‌ప్లాన్, బీసీ డిక్లరేషన్ పత్రంపై అధ్యయనం చేసేందుకు సీనియర్ నేత విఠల్ సారథ్యంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిథర్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ చంద్రవదన్, రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్, పార్టీ నేతలు దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్, మహిళా మోర్చా జాతీయ నేత కరుణా గోపాల్ హాజరుకానున్నారు. బండి సంజయ్ కూడా సమావేశానికి హాజరవనున్నారని నేతలు తెలిపారు.