హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఏ శాఖకు నిధుల కోతల్లేకుండా సర్కార్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రధానంగా సంక్షేమ పథకాలకు లోటు రాకుండా నిధులను సిద్దం చేస్తోంది. ప్రస్తుత ఆర్ధిక ఏడాది 2022-23లో ఏ పథకానికి ఎన్ని నిధులు అవసరమనే అంచనాలను బడ్జెట్లో పొందుపర్చుకున్నప్పటికీ కొత్తగా ధాన్యం కొనుగోళ్లు, నూతనంగా ఆసరా పింఛన్లకు భారీగా వ్యయాలు పెరుగనున్నాయి. ఇప్పటికే దళితబంధు పథకానికి రూ. 17,700కోట్లు, రైతుబంధుకు రూ. 14,800కోట్లు, విద్యుత్ సబ్సిడీలకు రూ. 10,500కోట్లు, ఆసరా పెన్షన్లకు రూ. 11,728కోట్లు, రైతుబీమాకు రూ. 1466కోట్లు, బియ్యం సబ్సిడీకి రూ. 2787కోట్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్లకు రూ. 2750కోట్లు, కేసీఆర్ కిట్లకు రూ.443కోట్లను కేటాయించింది. దీంతో ఈ ఏడాది ప్రకటించిన సంక్షేమ పథకాలకే రూ. 62,174కోట్లు ఖర్చు కానున్నాయి. మరో రూ. 20వేల కోట్లు జీతాలు, వడ్డీలు, పింఛన్లకు సరిపోనున్నాయి. కొత్త పథకాలకు భారీగా నిధుల అవసరం ఏర్పడిన నేపథ్యంలో పెండింగ్ బిల్లులపై ప్రభావం పడుతోందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇరిగేషన్, మహిళా స్వయం సహాయక బృందాలకు, ఫీజు రీఎంబర్స్మెంట్కు, ఆర్ అండ్ బికి, ఆరోగ్య శ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీం వంటి వాటి పెండింగ్ బిల్లుల్లో కీలకమైన వాటికి చెల్లింపుల దిశగా సర్కార్ ప్రయత్నిస్తోంది. కాగా రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ ఇబ్బందికరంగా ఉండటం, కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్ధిక రంగాన్ని గాడిలో పెడుతూ కీలక సర్దుబాట్లకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలకు కొంత గ్యాప్ వచ్చిందని ఆర్ధిక శాక వర్గాలు అంటున్నాయి. ఉద్యోగులు కోరిన మేరకు పీఆర్సీ, డీఏలను ప్రకటించిన ప్రభుత్వం వేతనాల ఖాతాలో భారీ పెరుగుదలను సంతరించుకుంది. ఈ మేరకు ఇతర ఖర్చులకు కోతలు పెట్టిమరీ రెగ్యులర్గా వేతనాలను చెల్లిస్తోంది. ఇక కీలక పథకాలైన మధ్యాహ్న భోజనం, హాస్టల్, అంగన్వాడీలలో సన్న బియ్యం, పాఠశాలలు, కళాశాలల్లో సన్న బియ్యంతో భోజనం వంటి పథకాలకు ఎక్కడ లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది.
గతేడాదివరకు వరుసగా రెండేళ్లపాటు కరోనా తీవ్రత నేపథ్యంలో రాబడి కోతల కారణంగా ప్రభుత్వం కొంత ఇబ్బందిని ఎదుర్కొంది.
ఆ తర్వాత గడచిన ఏడాది నుంచే రాష్ట్ర రాబడి కొంత ఉపశమిస్తున్నది. దీంతో కీలకమైన శాఖల్లో నిధులను చెల్లించేలా కసరత్తు చేస్తోంది. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖకు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులను విడుదల చేయాలని భావిస్తోంది. అదేవిధంగా రైతురుణ మాఫీకి భారీగా వ్యయం చేస్తోంది. అన్ని ఖర్చులు పక్కనపెట్టి మరీ ప్రభుత్వం ఈ ఏడాది రూ. 1850కోట్లను ఈ మాఫీకి కేటాయించి వెచ్చింది. రైతుభీమాకు రూ. 1100కోట్లకుపైగా ప్రీమియం చెల్లించింది. సీఎం కేసీఆర్ పేదింటి ఆడపిల్లలకు వరంగా ప్రకటించిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి రూ. 1000కోట్లు చెల్లింపులు చేస్తున్నది. మహిళా సంఘాలకు వడ్డీ బకాయిలు, ఇరిగేషన్ పథకాల్లో రూ. 12వేల కోట్ల పెండింగ్ చెల్లింపులకు దశలవారీగా ప్రాధాన్యతనిస్తోంది. కొత్త కలెక్టరేట్లు, రహదారులు, భవనాలు, బ్రిడ్జీలకు రూ. 1500కోట్ల మేర చెల్లింపులు చేసింది. అద్దెకార్లు, ప్రైవేటు భవనాల అద్దె, విద్యాశాఖలో మౌలిక వసతులకు భారీగా ఖర్చు చేసింది.
ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ కాంట్రాక్టర్లకు బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఎంతలా ఉందంటే ఆర్ధిక నియంత్రణలను పక్కనపెట్టిమరీ తక్షణ అవసరాలుగా తుదిదశలో ఉన్న ప్రాజెక్టులకు నిధులను చెల్లిస్తోంది. సాధ్యమైనంతలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆర్ధిక శాఖ కూడా తాజా ఆర్ధిక ఒడిదుడికులను పక్కనపెట్టి ప్రాధాన్యతకల్గిన ఈ అంశంపై దృష్టిసారించింది. మిగతా చెల్లింపులన్నీ నిలిపివేసి మరీ ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తోంది.