2022కు స్వాగతం పలికాం.. సరికొత్త ఆశలతో ప్రతీ ఒక్కరు నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ, వైద్య రంగాల్లో మెరుగైన అభివృద్ధి దిశగా పరుగులు పెట్టేందుకు సిద్ధం అయ్యాం. ప్రధాని మోడీతో పాటు ప్రతీ ఒక్కరికి కొత్త సవాళ్లను 2022 ముందుకు తీసుకొచ్చింది. ఈ ఏడాది 5 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకం. 2024, కేంద్రంలో అధికారాన్ని.. యూపీ అసెంబ్లీ ఎలక్షన్‌లే నిర్ణయిస్తానడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా ఒమిక్రాన్ వ్యాప్తి సైతం సవాల్‌గా మారనుంది. బూస్టర్ డోసుతో ఏడాదిని ప్రారంభించనున్నాం. ఇలాంటి కీలక సవాళ్లతో 2022ను ప్రారంభిస్తున్న మోడీకి ఎంత వరకు కలిసి వస్తుందో వేచి చూద్దాం..
యూపీని చుట్టేస్తున్న మోడీ
యూపీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఎంతో కీలకంగా మారనున్నాయి. 2017లో అక్కడ అఖండ విజయాన్ని అందుకున్న బీజేపీ మరోసారి పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో విజయమే.. 2024లో మూడో సారి ప్రధానిగా నరేంద్ర మోడీని కూర్చోబెట్టేందుకు కీలక అస్త్రంగా మారనుంది. అందుకే గత రెండు నెలల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ను 12 సార్లు మోడీ పర్యటించారు. 2022 మార్చిలో ఉత్తరాఖండ్, ఏడాది చివర్లో గుజరాత్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కూడా మోడీకి సవాళ్లు విసరనున్నాయి. అక్కడ కూడా అధికారాన్ని నిలుపుకోవాలని ఆయన చూస్తున్నారు. అయితే సిట్టింగ్ ముఖ్యమంత్రులను మార్చడం ప్రతికూలంగా మారే అకాశం ఉంది. ఇవి కాకుండా.. గోవా, మణిపూర్, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఎన్నికలు ఉండటంతో.. 2022 మోడీ రాజకీయ భవిష్యత్తుకు కీలకంగా మారనుంది.
ఒమిక్రాన్ వార్నింగ్
కరోనా అంశం మోడీ ముందు ఉన్న మరో సవాల్. ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో.. రెండో వేవ్ మిగిల్చిన అనుభవం నుంచి నేర్చుకొని మౌలిక సదుపాయాలు, ఆస్పత్రుల్లో పడకలు, తగినన్ని ఆక్సిజన్ ప్లాంట్లతో సిద్ధంగా ఉంటుందా..? లేదా..? అనేది కీలకం. సెకండ్ వేవ్ అనుభవాలను రిపీట్ కాకుండా ముందడుగు వేయాల్సి ఉంది. కొత్త సంవత్సరంలో మూడో డోసు వ్యాక్సిన్‌తో మోడీ సర్కార్ ఘనంగా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నది. అంతేకాకుండా.. 15 నుంచి 18 ఏళ్ల టీనేజర్లకు వ్యాక్సిన్‌కు పచ్చ జెండా ఊపింది. మోడీ నేతృత్వంలో భారత్ అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్‌ను చేపట్టింది. దాదాపు 62 శాతం టీకాను వేయించుకున్నారు. ఇవన్నీ రానున్న రాష్ట్రాల ఎన్నికల్లో ఎంత మేరకు మోడీకి, బీజేపీకి లబ్ది చేకూరుస్తాయో తెలియాలంటే.. మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే..
చదువులపై కీలక దృష్టి
ఒమిక్రాన్ వ్యాప్తి.. దేశంలో మూడో వేవ్‌కు కారణం అయ్యే ప్రమాదం ఉంది. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. డెల్టా వేరియంట్ కారణంగా రెండో సారి దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఒమిక్రాన్ కారణంగా.. మళ్లీ ఇబ్బందులు ఎదుర్కోకుండా అమ్రత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. కరోనా మహమ్మారి ఉన్నంత వరకు నిబంధనలు పాటించాల్సిందే. 2021లో పిల్లల చదువులకు కలిగిన నష్టాన్ని 2022లో భర్తీ చేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిబంధనలను రూపొందించాయి. 2022లో దేశానికి ఎదురయ్యే ఆరోగ్యమైన సవాళ్లు, అంటు వ్యాధుల నుంచి నేర్చుకునేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. వీటన్నింటి గురించి ఆలోచించడానికి కొత్త సంవత్సరం సరైన సమయం.
ఎన్నికల నిర్వహణకే మొగ్గు..
2022లో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిర్వహణకే మొగ్గు చూపుతున్నది. యూపీ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు లక్నో వచ్చిన సీఈసీ సుశీల్ చంద్ర కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కరోనా ప్రొటోకాల్ అనుసరించి.. సకాలంలో ఎన్నికలు నిర్వహించనున్నాయి. జనవరి 5వ తేదీన తుది జాబితా విడుదల అవుతున్నది. 5 తరువాత ఫిర్యాదులు వస్తే.. పరిష్కరిస్తారు. దీంతో జనవరి రెండో వారంలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. 80 ఏళ్లు పైబడినవారు, వికలాంగులు, కరోనా సోకిన వారు పోలింగ్ కేంద్రానికి రాలేని వారి ఇంటి వద్దకే ఎన్నికల సంఘం చేరుకుంటుంది.