Tuesday, November 26, 2024

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు తొలి పతకం

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు తొలి పతకం దక్కింది. మహిళల 49 కేజీల విభాగంలో వెయిట్​ లిఫ్టర్​ మీరాబాయి చాను రజతం గెల్చుకుంది. ఒలింపిక్స్​లో రజత పతాకం సాధించిన తొలి వెయిట్​ లిఫ్టర్​గా మీరాబాయి ఘనత సాధించింది. స్నాచ్‌లో 87 కిలోలు ఎత్తిన ఆమె.. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు ఎత్తింది. మొత్తంగా 202 కిలోలు ఎత్తి భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. చైనాకు చెందిన హూ ఝూహీ 210 కిలోల బరువునెత్తి స్వర్ణం సాధించింది.

కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్​ లిఫ్టింగ్​లో భారత్‌కు పతకం అందించింది మీరాభాయి చానునే. దాదాపుగా 20 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించింది. మహిళల 49 కిలోల విభాగంలో భారత కీర్తి పతాకను శిఖరాగ్రాలకు చేర్చింది. ఒలింపిక్స్‌ ఆరంభమైన రెండో రోజే భారత పతకాల కొరతను తీర్చేసింది. చిరస్థాయిగా నిలిచే ఘనత అందుకుంది.

ఈశాన్య రాష్ట్రంలోని మణిపూర్ రాజధాని ఇంఫాల్ ప్రాంతంలోని నాంగ్ పాక్ కాక్ చింగ్ లో సాధారణ కుటుంబంలో జన్మించింది మీరాబాయి. 12ఏళ్ల వయసులో వెయిట్ లిఫ్టింగ్ లో కుంజరాణి దేవిని చూసి స్ఫూర్తి పొందింది. వంట కోసం అడవికి వెళ్లి కట్టెలమోపును మోయడమే ఆమెకు తొలి శిక్షణగా మారింది. అటుపై ఖరీదైన వెయిట్ లిఫ్టింగ్ లో రోజూ 60 కిలోమీటర్లు వెళ్లి శిక్షణ పొందేది. అక్కడ మొదలైన ఆమె పయనం.. నేడు టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం వరకూ కొనసాగింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో భారత్ తరపున వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్యం సాధించిన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి తర్వాత ఇన్నేళ్లకు వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు మెడల్ రావడంతో దేశం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది.

ఒలింపిక్స్​లో రజతంతో మెరిసిన మీరాబాయి చానును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ప్రధాని.. ఆమె విజయం భారత ప్రజలందరిలో స్ఫూర్తి నింపుతుందని అన్నారు. టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు గొప్ప శుభారంభం దక్కిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండిః హాకీలో భారత్ బోణీ.. న్యూజిలాండ్ పై ఘన విజయం

Advertisement

తాజా వార్తలు

Advertisement