దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలు నేటి నుంచి వీకెండ్ కర్ఫ్యూ అమలు చేయనున్నాయి. తమిళనాడులో ఆదివారం నుంచి సండే లాక్‌డౌన్ అమలులోకి రానుంది. ఇక పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అన్ని విద్యాసంస్థలను మూసివేయగా.. మున్ముందు మరిన్ని కఠిన నిబంధనలు అమలుచేసే యోచనలో ఉన్నాయి.
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ శుక్రవారం రాత్రి 10గంటల నుంచే అమలులోకి వచ్చింది. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు మినహా అన్ని రకాల కార్యకలాపాలపై నిషేధం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లేవారు ప్రభుత్వం జారీ చేసిన ఈ-పాస్‌ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు వెళ్లేవారు తమ ప్రయాణానికి సంబంధించిన టికెట్లను చూపించాల్సి ఉంటుంది. టికెట్లు లేనివారిని కర్ఫ్యూ సమయంలో బయటకు అనుమతించరు. నిత్యావసర వస్తువులు విక్రయించే షాపులు, మెడికల్ షాపులు తెరిచే ఉంటాయి. ఫుడ్ డోర్ డెలివరీ, ఈకామర్స్ గూడ్స్ డోర్ డెలివరీకి అనుమతి ఉంటుంది.
కర్ణాటకలోనూ వీకెండ్ కర్ఫ్యూ శుక్రవారం రాత్రి నుంచే అమలులోకి వచ్చింది. సోమవారం (జనవరి 10) ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను రెండు వారాల పాటు మూసివేయాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కర్ఫ్యూ సమయంలో ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో జరిగే వివాహ కార్యక్రమాలకు 200 కంటే తక్కువ, ఫంక్షన్ హాల్స్‌లో జరిగే వివాహాలకు 100 కంటే తక్కువ మందిని అనుమతిస్తారు. బార్స్, పబ్స్, సినిమా థియేటర్స్ 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తాయి.
మరోవైపు అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ విధించాయి. ఒడిశాలో అన్ని విద్యా సంస్థలను మూసివేసింది. చండీగఢ్ కూడా రాత్రి కర్ఫ్యూ విధించింది. 214 రోజుల తర్వాత భారత్‌లో లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,52,26,386కి చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 3,007 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..