Friday, November 22, 2024

Followup: వెబ్ సిరీస్‌, పోర్న్‌ చూసే గ్యాంగ్ రేప్‌కి ప్లాన్‌.. నిందితులకు టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : జూబ్లిహిల్స్‌లో మైనర్‌ బాలికపై సామూమిక అత్యాచారం కేసులో పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఆంగ్ల సినిమాలు, వెబ్‌ సిరీస్‌ చూసి అత్యాచార ప్లాన్‌ రచించినట్టు నిందితులు తెలిపారు. ఈ కేసులో మైనర్లను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నాలుగు రోజులపాటు విచారించి సమాచారాన్ని రాబట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మంది సాక్షులను గుర్తించిన పోలీసులు ఏడుగురిని విచారించారు. మైనర్‌ బాలికలను తీసుకువెళ్లిన బెంజ్‌, ఇన్నోవా కార్లను మైనర్లే నడిపినట్టు పోలీసులు గుర్తించారు. బెంజ్‌ కారు యజమానిపై జూబ్లిహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్‌ బాలికను అత్యాచారం చేసిన ఇన్నోవా వాహనాన్ని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ సొంత వాహనంగా తేల్చారు.

ఈ వాహనానికి ప్రభుత్వ వాహనమని స్టిక్కర్‌ అతికించినట్టు పోలీసుల దర్యాప్తు బయటపడింది. వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ కుమారుడిని డ్రైవర్‌ ఇన్నోవాలో పబ్‌కు తీసుకువెళ్లాడు. అక్కడి నుంచి మిగతా మైనర్లతో కలిసి బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌లో 14లో ఉన్న కాన్సూ బేకరీకి వెళ్లాడు. బేకరీ వద్ద డ్రైవర్‌ను వదిలిపెట్టి వాహనాన్ని చైర్మన్‌ తనయుడు మైనర్‌ నడుపుతూ అందులో బాలికతో పాటు మరో ఐదుగురిని ఎక్కించుకున్నాడు. దారిలో ఓ మైనర్‌ బాలుడు దిగిపోగా మిగతా ఐదుగురు కలిసి జూబ్లిహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 44లో ఉన్న పెద్దమ్మగుడి పరిసర ప్రాంతాలకు చేరారు. అక్కడే ఇన్నోవా వాహనంలో మైనర్‌ బాలికపై ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ తర్వాత మైనర్‌ బాలికను పబ్‌ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన బాలిక మెడపై ఆమె తల్లి గాయాలను గుర్తించి బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఈ గాయాల గురించి బాలిక స్నేహితుడిని ప్రశ్నించగా పబ్‌లో ఆరుగురు కలిసి బాలికను తీసుకువెళ్లినట్టు తల్లిదండ్రులు చెప్పారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారం జరిగినట్లు గుర్తించిన తల్లిదండ్రులు జూబ్లిహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన పూర్వాపరాలను తెలుసుకోకుండానే పోలీసులు బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టాన్ని నమోదు చేశారు.

టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌పై పిటిషన్‌
అత్యాచారం జరిపిన నిందితులను గుర్తించే ప్రక్రియను చేపట్టాలని పోలీసులు సంకల్పించారు. టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ (టీఐసీ)కు సంబంధించిన పిటిషన్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం అనుమతిస్తే ఒకటి, రెండు రోజుల్లో కోర్టులో బాలిక నిందితులను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని పోలీసులు నిర్ణయించారు.

కాగా ఫోక్సో చట్టం ప్రకారం మైనర్లపై లైంగిక దాడులు జరిగినపుడు ఆ విషయం తెలిసి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం నేరంగా పరిగణిస్తారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌తో సహా ఐదుగురు మైనర్ల తల్లిదండ్రులకు నోటీసులు పంపారు. బెంజి కారు, ఇన్నోవా వాహనాన్ని మైనర్లు నడిపినట్టు సాక్ష్యాలు లభించడంతో ట్రాఫిక్‌, శాంతిభద్రతల పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.

- Advertisement -

పబ్‌లో మే 28న జరిగిన పార్టీకి 182 మంది హాజరు కాగా ఇందులో 70 మంది బాలికలు, యువతులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో 50 మంది బాలికలు, యువతులతో పోలీసులు సంప్రదించి పబ్‌లో ఏం జరిగింది? బాధిత బాలికను ఎవరైనా అల్లరి చేశారా? ఆమె నృత్యం చేస్తున్నపుడు నిందితులు ఆమె వద్దకు వెళ్లారా? ఇద్దరు బాలికలు మాత్రమే బయటకు వెళ్లారా? వారితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అనే ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అత్యాచార ఘటనకు సంబంధించి పరోక్షంగా, ప్రత్యక్షంగా 20 మంది సాక్షులను విచారించినట్టు తెలుస్తోంది.

సామూహిక అత్యాచారానికి పాల్పడిన అనంతరం నిందితులు బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు ఏం చేయనున్నారని గమనించినట్టు పోలీసుల విచారణలో తేలింది. జూబ్లిహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న సాదుద్దీన్‌, ఐదుగురు మైనర్లు పోలీసులకు దొరక్కుండా తలోదారి ఎంచుకుని పారిపోయినట్టు గుర్తించారు. ఇదే విషయాన్ని వారు విచారణలో అంగీకరించారు.

బంజారాహిల్స్‌లో ఉంటున్న ఒక నిందితుడు తన తల్లి అప్పటికే ఊటీలో ఉండగా అక్కడికి పారిపోయినట్టు గుర్తించారు. మరొకరు ఏపీలోని నెల్లూరు ప్రాంతలోని దర్గాకు వెళ్లి పోలీసులకు చిక్కాడు. మరో ఇద్దరు మధ్యవర్తుల ఆధారంగా పోలీసులకు లొంగిపోయారు. ఏ5గా ఉన్న మైనర్‌ను గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement