వేసవి కాలంలో ఎండలు మండిపోతున్న వేళ.. తెలుగురాష్ట్రాలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి కొనసాగుతుండటంతో రానున్న 48 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతం దగ్గర ఉన్న ఉత్తర తమిళనాడు తీర ప్రాంతం మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. సముద్ర మట్టానికి 2.1 కిలో మీటర్లు నుంచి 3.6 కిలోమీటర్ల మధ్య ఉంది. ఉపరితల ఆవర్తనం బలహీన పడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ కేరళ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుందని వాతావారణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల ఓ మోస్తరు వానలు కురువడంతో వాతావరణం కొంత చల్లబడింది. బుధ, గురువారాల్లో తెలంగాణలోని నైరుతి, ఉత్తర, తూర్పు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు కొన్ని రోజులుగా ఉపశమనం కలుగుతోంది. అయితే, మళ్లీ వానలు కురస్తాయన్న వాతావరణశాఖ ప్రకటనతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం పంటలను నష్టం కలిగిస్తుందని ఆందోళన చెందుతున్నారు.