Friday, November 22, 2024

హైదరాబాద్‌తో కలిసి పనిచేస్తాం.. కేటీఆర్‌తో భేటీలో మసాచుసెట్స్‌ గవర్నర్‌ వెల్లడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌ నగరంతో కలిసి పని చేసేందుకు అమెరికాలోని బోస్టన్‌ నగరం ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్‌ చార్లీ బేకర్‌ శుక్రవారం మంత్రి కె. తారకరామారావుతో జరిగిన సమావేశంలో ఒక ప్రకటన చేశారు. గురువారం అమెరికా, మసాచుసెట్స్‌ రాష్ట్రంలోని బోస్టన్‌లో జరిగిన గ్లోబల్‌ ఇన్నోవేషన్‌-2022 అనే సదస్సులో కేటీఆర్‌ పాల్గొన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు, అమెరికాలోని బోస్టన్‌ నగరానికి మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని, ముఖ్యంగా హైదరాబాద్‌ తరహాలో ఇక్కడ కూడా ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, ఐటీ రంగాలకు చెందిన అనేక కంపెనీలు పని చేస్తున్నాయని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవకాశాలను పరిశీలించడంతో పాటు లైఫ్‌ సైన్సెస్‌ ఫార్మా కంపెనీల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా బేకర్‌ అభిప్రాయపడ్డారు. తద్వారా ఈ రంగంలో అనేక నూతన పరిశోధనలు ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందన్నారు. హెల్త్‌ రికార్డుల డిజిటలీకరణ కొనసాగుతున్నదని, తద్వారా పౌరులకు అనేక ప్రయోజనాలు కలుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రస్తావించారు. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో ఈ డిజిటల్ హెల్త్‌ రికార్డుల కారణంగా వారికి వేగంగా చికిత్స అందించేందుకు అవకాశం కలిగిందని తెలిపారు. ఇరు నగరాల మధ్య అవగాహన కోసం చేపట్టే కార్యక్రమాల వల్ల భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా కేటీఆర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఈ సమావేశంలో కేటీఆర్‌ చేసిన ప్రసంగానికి మంచి స్పందన లభించింది. తెలంగాణ ప్రభుత్వం సైతం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రెండు జిల్లాలో పౌరుల హెల్త్‌ రికార్డులను డిజిటలైజేషన్‌ చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న లైఫ్‌ సైన్సెస్‌ రంగంలోని సైంటిస్టులతో పాటు ఐటీ, టెక్‌ రంగాల డేటా సైంటిస్టుల ఉమ్మడి కృషి వల్ల రానున్న రోజుల్లో అద్భుతమైన ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ వివిధ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత కారణంగా సమగ్రంగా అభివృద్ధి చెందుతోందని, ఆయా రంగాలకు ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని కేటీఆర్‌ అన్నారు. ముఖ్యంగా బయో, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో టెక్నాలజీకి పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో #హదరాబాద్‌ నగరంలో ఉన్న నోవర్టిస్‌ లాంటి కంపెనీల కార్యకలాపాలను ఉదహరించారు. హైదరాబాద్‌ నగరంలో ఉన్న అవకాశాలను వివరించారు. బోస్టన్‌ నగరంలోని నిర్వాణ లైఫ్‌ కేర్‌లో జరిగిన ఈ సమావేశంలో నిర్వాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయెష్‌ రంజన్‌, డైరెక్టర్‌ లైఫ్‌ సైన్సెస్‌ శక్తి నాగప్పన్‌, నిర్వాణ హెల్త్‌ కేర్‌ ఛైర్పర్సన్‌ జాన్‌ స్కల్లి, సీఈఓ రవి ఐక, శశి వల్లిపల్లిలు పాల్గొన్నారు.

ప్రపంచ లైఫ్‌సైన్సెస్‌ రాజధానిగా హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌
తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా రంగంలో చేపడుతున్న కార్యక్రమాలకు అమెరికాలోని వివిధ కంపెనీల ప్రతినిధులు నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అమెరికాలోని బోస్టన్‌ నగరంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ హైదరాబాద్‌ నగరం ప్రపంచ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా పేరు ఉన్నదని ఈ సందర్భంగా తెలిపారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలైన ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టిందని, అందులో ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు, పాలసీ పరమైన నిర్ణయాలు, ఇన్నోవేషన్‌కి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫండ్‌ను ఏర్పాటు చేయడం, జీనోమ్‌ వ్యాలీలో ప్రత్యేకంగా ఒక ఇంక్యుబేటర్‌ ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలను తీసుకున్నదని, వీటి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ బయో లైఫ్‌ సైన్సెస్‌ ఫార్మా ఉత్పత్తులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement