తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 90 నుంచి 100 స్థానాల్లో బీఆర్ఎస్ ఈజీగా గెలుస్తుంది. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని కేటీఆర్ పేర్కొన్నారు. మంచి ప్రదర్శన ఉన్న ఎమ్మెల్యేలందరికీ సీట్లు దక్కుతాయి. వెనుకబడిన ఎమ్మెల్యేలు తమ ప్రదర్శన మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసే దిశగా ఆలోచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోనూ మా పార్టీ కార్యక్రమాలు ప్రారంభించింది అని కేటీఆర్ తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము ఉందా.. అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఒక పార్టీ కాకుండా ఎన్జీవో, దుకాణాన్ని నడుపుకోవాలి. గుజరాత్లో ఎన్నికలు జరుగుతుంటే రాహుల్ పారిపోయాడు. పీవీ నరసింహారావును అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు.ప్రధాని మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది … మోదీ ప్రభుత్వం గద్దె దిగాల్సిన అవసరం ఉంది. బీజేపీకి దమ్ముంటే దేశానికి చేసిన మంచి పనులు ఏంటో చెప్పాలి. నోట్ల రద్దుతో ఏం సాధించారో మోడీ ప్రజలకు సమాధానం చెప్పాలి.
ఇప్పుడు రూ. 2 వేల నోట్ల రద్దుతో సాధించింది ఏంటో కూడా చెప్పాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు.. లేని నిరుద్యోగం గురించి ఇక్కడ నిరసనలు చేస్తున్నారు. మేం విదేశీ పర్యటనలు చేసి వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. తాజా పర్యటనతో 42 వేల మందికి ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చాం అని కేటీఆర్ తెలిపారు.ఓఆర్ఆర్ టెండర్ ప్రక్రియ నేషనల్ హైవే టెండర్ మాదిరే జరిగిందని కేటీఆర్ తెలిపారు. ప్రతిపక్షాల ఆరోపణలపై మున్సిపల్ శాఖ ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించింది. లీగల్ నోటీసులకు సమాధానం చెప్పాలి. చిల్లర మాటలు, ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలు మానుకోవాలి అని కేటీఆర్ హెచ్చరించారు. మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను పక్క రాష్ట్రాల్లో పొగిడిన ఓవైసీ ఇక్కడ ఎందుకు విమర్శలు చేస్తున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారన్నది ఎంఐఎం పార్టీ ఇష్టం. ప్రజలు మత ప్రతిపాదికన ఓట్లు వేస్తారని నేను నమ్మను. మంచి ప్రభుత్వాన్ని మతాలకతీతంగా ఎన్నుకుంటారని నమ్ముతున్నాను అన్నారు. తెలంగాణలో బీజేపీ లేనే లేదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలోనే బీజేపీ హంగామా అని ఆయన పేర్కొన్నారు.సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా అనేది నా వాదన కాదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. జనాభా నియంత్రణ చేపట్టిన రాష్ట్రాలు నష్టపోకూడదన్నదే నా వాదన. ప్రజాస్వామ్యంలో అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు ఉండాలి. యూపీ లాంటి రాష్ట్రంలో పెరిగే సీట్ల మొత్తం దక్షిణాది రాష్ట్రాల సీట్ల కన్న ఎక్కువ. దేశ ప్రగతికి మద్దతు ఇచ్చిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకూడదు. అలాంటి పరిస్థితి వస్తే ఎవరూ సహించరు. లోక్సభ స్థానాల పెంపుపై ఆరోగ్యవంతమైన చర్చ జరగాలని కేటీఆర్ సూచించారు.షర్మిల, కేఏ
పాల్ది భ్రమ మాత్రమే..
రాష్ట్రంలో మాతో పోటీ పడే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ భ్రమల్లో ఉంది. రాష్ట్రంలో షర్మిల, కేఏ పాల్ అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. వారిది కూడా భ్రమనే అని కేటీఆర్ పేర్కొన్నారు.