త్వరలో ఐటి హబ్ ప్రారంభిస్తామని, తెలంగాణలో కలలు కన్న ప్రగతి సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శనివారంనిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డు వద్ద గల నిర్మాణంలో ఉన్న ఐటి హబ్ భవన పనులను ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బీగాల పరిశీలించారు. ఐటి హబ్ కు సంబందించిన వెబ్ సైట్ పై ఎమ్మెల్సీకి బీఅర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేష్ గుప్తా వివరించారు. వెబ్ సైట్ ను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పరిశ్రమల అభివృద్ధికి ఐటి హబ్ ఒక ఆరంభం లాంటిదని తెలిపారు. ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్ కు రానున్నాయన్నారు. నిజామాబాద్ లో ఐటి హబ్ నిర్మాణానికి ఎంతో శ్రద్ద తీసుకున్న సీఎం కేసీఆర్, కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా చేపట్టిన ఐటి హబ్ పనులు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. అతి త్వరలో కేటీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఇతర జిల్లాల ఐటి హబ్ లతో పోల్చుకుని లోటుపాట్లను సరిదిద్ది నిజామాబాద్ ఐటి హబ్ ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. 50 కోట్ల వ్యయంతో చేపట్టిన ఐటి హబ్ లో 750 మంది యువతకు అవకాశం.. కలుగుతుందన్నారు. ఇప్పటికే 200 పై చిలుకు సీట్లు ఒప్పందాలు పూర్తయ్యాయన్నారు. దేశవ్యాప్తంగా ఐటి ఎక్స్పోర్ట్ లో రెండవ స్థానంలో ఉన్నామని తెలిపారు. భవిషత్ ప్రణాళికతో నిర్మాణాలు చేయించిన ఎమ్మేల్యే గణేష్, ఎన్నారై కొర్డినేటర్ మహేష్ బిగాలకు అభినందనలు తెలిపారు. డిగ్రీ కళాశాలలతో ఒప్పందాలు పెట్టుకుంటాం.. మరింత అభివృద్ది సాధించేందుకు ముందుకెళ్తామన్నారు. జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు.