విపరీతంగా పెరిగిపోతున్న నీల్‌గాయ్ (బ్లూ బుల్)లను ఇకపై వధించబోమని, దానికి బదులు సంతానోత్పత్తి తగ్గించే ఏర్పాట్లు చేస్తామని బిహార్ ప్రభుత్వం వెల్లడించింది. నీల్‌గాయ్స్ అనేవి ఆసియాలోనే అతి పెద్ద జింక జాతి జంతువులు. ఉత్తర భారతంలో ఎక్కువగా, హిమాలయ పాదాల ప్రాంతాల్లో బాగా కనిపిస్తాయి. భారత ఉపఖండానికి మాత్రమే చెందిన జంతువులుగా ఇవి గుర్తింపు పొందాయి.
ఇండియా, నేపాల్, పాకిస్తాన్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. గడ్డి భూములు, తక్కువ చెట్లున్న అడవులు, వ్యవసాయ ప్రాంతాలు, మనుషులుండే ఇళ్ల దగ్గర ఇవి ఎక్కువగా ఉంటాయి. దట్టమైన అడవుల్లోకి వెళ్లవు. ఆడ, మగ నీల్ గాయ్‌లను సులభంగా గుర్తించేలా తేడాలుంటాయి. మగ జంతువులు పెద్దగా, రంగు వేరేలా ఉంటాయి. ఐయూసీఎన్ రెడ్ లిస్టులో లీస్ట్ కన్‌సర్న్డ్ జాబితాలో, వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ చట్టం 1972లో మూడో షెడ్యూల్‌లో ఈ జంతువులున్నాయి.