– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
వరంగల్ జిల్లాలో ఇవ్వాల (శనివారం) పర్యటించిన మంత్రి కేటీఆర్‌ను టీయూడబ్ల్యూజే 143 నేతలు ఇండ్ల స్థలాలు, జర్నలిస్ట్ సమస్యలపై కలిశారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇక్కడ జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ భూములు ఎక్కడ కేటాయించారో వాటి భూమి ధర చెల్లింపునకు ఖాతా నంబరు ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు.
వరంగల్ జిల్లాలో రెండు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలు ఉండగా, అధికారులు గతంలోనే వాటికి భూములను కేటాయించారు. అయితే ఇందుకు సంబంధించి భూమి ధర చెల్లింపునకు ఖాతా నంబర్ ఇస్తే తాము డబ్బులు చెల్లిస్తామని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే హౌసింగ్ సొసైటీల్లో లేని జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయమై టీయూడబ్ల్యూజే 143 నేతలు లెనిన్, కక్కెర్ల అనిల్ కుమార్ గౌడ్, తుమ్మ శ్రీధర్ రెడ్డి, మెండు రవీందర్, చిలుముల సుధాకర్, వెంకన్న, రాజేంద్రప్రసాద్ తదితరులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్.. రెండు హౌసింగ్ సొసైటీల్లోని సభ్యులు పోగా, మిగిలిన సభ్యుల జాబితాను రూపొందించాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు సూచించారు. జాబితా ఫైనల్ అయితే వారికి కూడా ఇళ్ల స్థలాల కోసం భూమి కేటాయించాలని మంత్రి అక్కడే ఉన్న కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.