రాజ్యాంగ మార్పులు, రిజర్వేషన్ల వ్యవహరంలో కాషాయ పార్టీ లక్ష్యంగా కాంగ్రెస్ ముఖ్య నేత, ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం భింద్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. తాము ఎన్నికల్లో విజయం సాధిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని, దాన్ని రద్దు చేస్తామని బీజేపీ నేత, కేంద్ర మంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలు స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. రాజ్యాంగం దేశంలోని పేద ప్రజల ఆత్మని రాహుల్ పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని ఏ ఒక్కరూ తాకలేరని, ఈ ప్రపంచంలో ఏ శక్తీ దాన్ని మార్చలేదని కానీ బీజేపీ నేతలు మాత్రం కలలు కంటున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. బాబా సాహెబ్‌తో పాటు బ్రిటిషర్లతో పోరాడిన వ్యక్తులు ప్రజల గొంతుకగా రాజ్యాంగాన్ని తయారు చేశారని గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని చెరిపేయడాన్ని రైతులు, కార్మికులు సహించరని దాన్ని తాము కాపాడితీరుతామని స్పష్టం చేశారు. కాగా, మోదీ ప్రభుత్వం మూడోసారి అధికార పగ్గాలు చేపడితే బీజేపీ దేశ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ సహా విపక్షాలు కాషాయ పార్టీపై ఆరోపణలు చేస్తున్నాయి.
..అయితే రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు పదేపదే చెబుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని రిజర్వేషన్లను రద్దు చేయాలని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కోరుకున్నా అది సాధ్యం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కాంగ్రెస్, విపక్ష ఇండియా కూటమి కుట్రలను ఛేదించేందుకే ఎన్డీయే కూటమికి 400కుపైగా సీట్లు కట్టబెట్టాలని ప్రజలను కోరుతున్నామని ప్రధాని చెబుతున్నారు.