Saturday, November 23, 2024

తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శం.. అత్యుత్తమ 20 గ్రామాల్లో 19 తెలంగాణవే : కేటీఆర్‌

తెలంగాణ మంత్రి, టీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవ్వాల (బుధ‌వారం) సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లెలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకట్రావుపల్లెలో రూ.16 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాన్ని ప్రారంభించారు. రూ.33 లక్షలతో నిర్మించిన కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించారు.
వెంకట్రావుపల్లె ప్రాథమిక పాఠశాలను 7వ తరగతి వరకు అప్ గ్రేడ్ చేస్తామని చెప్పారు.

ఇక‌.. ముస్తాబాద్ మండలం ఛీకోడు గ్రామంలో సీసీ కెమెరాలు, డిజిటల్ క్లాస్ రూమ్ లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గ్రామంలో కొత్తగా కళ్యాణ మంటపం నిర్మిస్తామని అన్నారు. ఛీకోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుకునేందుకు 3 కిలోమీటర్ల దూరంలోని పర్శారాములు నగర్ నుంచి కాలినడకన వస్తున్న 25 మంది విద్యార్థులకు 25 సైకిళ్లు సాయంత్రం వరకు అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఇంకా.. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడారంటే..

మనందరి బాగుకోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల మంజూరుకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారు. త్వరలోనే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తాం. ప్రతి గ్రామపంచాయతీలో తాగునీటి సౌకర్యంతోపాటు ట్రాక్టర్, ట్రాలీ, వైకుంఠ ధామం, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, రోడ్లు, డ్రైనేజీలు సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. వెంకట్రావుపల్లెలో విరాసత్ సహా అన్ని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాం. గ్రామానికి సాగునీటి సౌకర్యం కల్పిస్తాం, సొంత జాగాలో ఇండ్ల నిర్మాణం చేసుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తాం అని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నాం
ఉపాధి కల్పనలో దేశంలో తెలంగాణ ముందుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతోపాటు ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడించారు. నలుగురికి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చేవారిని ప్రోత్సహిస్తామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. దేశంలో 65 శాతం జనాభా 35 ఏండ్ల లోపువారేనని తెలిపారు. 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి అన్నివిధాల అండగా ఉంటామని చెప్పారు. ఇంటింటికి తాగు నీరు ఇస్తున్నామని, ఎండా కాలంలోను చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయన్నారు. ముస్తాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు.

- Advertisement -

సీఎం కేసిఆర్ నాయకత్వంలో జోడెడ్ల మాదిరి అభివృద్ధి, సంక్షేమం పరుగులు
సీఎం కేసిఆర్ నాయకత్వంలో జోడెడ్ల మాదిరి అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తోంద‌ని మంత్రి కేటీఆర్‌ అన్నారు.
ఛీకొడు రైతు వేదికలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలోనే అత్యుత్తమ 20 గ్రామాల్లో 19 తెలంగాణవే నని అన్నారు. రైతులకు 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. 75 ఎండ్లలో దేశంలోనీ ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలన్న స్పృహ గ‌త ప్ర‌భుత్వాల‌కు రాలేదనీ అన్నారు.

మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో సాగునీటి రంగంలో అద్భుతాలు సృష్టించాo అని చెప్పారు. పెన్షన్ ల క్రింద ఏటా తెలంగాణలో 10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాo.. తెలంగాణలో 2, 600 రైతు వేదికలను 6 నెలల్లో నిర్మించాo.. రైతు బంధు కింద 50 వేల కోట్ల రూపాయలను పెట్టుబడి సహాయంగా అందజేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ అరుణ రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement