Monday, November 25, 2024

సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. రెబల్స్ తో డీకే చర్చలు

ఏ పార్టీ సహకారం లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుతం 120 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాల్లో ఇప్పటికే మెజార్టీ సాధించామని, దీంతో ఏ ఒక్క పార్టీ సహాయం లేకుండానే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ కు అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో పట్టు నిలుపుకున్నామని తెలిపారు. బీజేపీ తరుపున ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు నెల రోజులుగా ప్రచారంతో హోరెత్తించినా ప్రజలు వారి మాటలను పట్టించుకోలేదనే విషయం ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ ను రుజువు చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి పదవి గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ ఆ పదవి ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని ఒక్క ముక్కలో తేల్చేశారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో కాంగ్రెస్ రెబల్స్ అభ్యర్థులు ఐదుగురు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డి.శివకుమార్ వారితో మంతనాలు ప్రారంభించారు. కాంగ్రెస్ గూటికి వారిని రప్పించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ ఐదుగురు అభ్యర్థులు కాంగ్రెస్ గూటికి చేరినట్లైతే కాంగ్రెస్ బలం 125 స్థానాలకు పెరిగే అవకాశముంది. కాగా.. పోటాపోటీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ముందు జాగ్రత్తగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులందరూ వెంటనే బెంగళూరుకు రావాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మెజార్టీ సభ్యులు బెంగళూరుకు పయనమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement