Tuesday, November 19, 2024

మేము చ‌చ్చిపోతాం, ప‌ర్మిష‌న్ ఇవ్వండి.. రాష్ట్రపతి, గవర్నర్‌కు ఉపాధ్యాయుల లేఖ

టేకులపల్లి, ప్రభన్యూస్‌: మేము చ‌చ్చిపోతాం.. ప‌ర్మిష‌న్ ఇవ్వాలి అని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌కు గిరిజ‌న ఆశ్ర‌మ పాఠ‌శాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు లేఖ రాశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్టు టీచర్లుగా తాము 14 సంవత్సరాలుగా ప‌నిచేస్తున్న‌ట్టు ఆ సూసైడ్ లేఖ‌లో పేర్కొన్నారు. గిరిజన ఆవాసాల్లో ఉన్న ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నట్టు తెలిపారు. 2018 -19లో అప్ప‌టి ఐటీడీఏ పీవో పమేల సత్పతి 11 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను అకారణంగా తొలగించారని, పలుమార్లు సంబంధిత గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌, గిరిజన ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని పేర్కొన్నారు. గత్యంతరం లేక 2018లో హైకోర్టును ఆశ్రయించామ‌ని, 2020లో హైకోర్టు న్యాయమూర్తి ఎంఎస్‌ రామచందర్‌ రావు కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల‌ను రెగ్యుల‌రైజ్ చేసి విధుల్లోకి తీసుకోవాల‌ని సింగిల్‌ బెంచ్‌ జడ్జిమెంట్ ఇచ్చార‌ని తెలిపారు.

దాన్ని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ ఇంప్లిమెంటేషన్‌ చేయకుండా అప్పీల్‌కి వెళ్లార‌ని, డివిజన్‌ బెంచ్‌ చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ తుకారాంజిల‌తో కూడిన‌ ధర్మాసనం తిరిగి కాంట్రాక్టు పద్ధతిపై విధుల్లో తీసుకోవాలని గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో తీర్పు ఇచ్చింద‌న్నారు. ఈ తీర్పు వెలువ‌డి 4 నెలలు కావస్తున్నా ఐటీడీఏ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌, గిరిజన శాఖ అడిషనల్‌ డైరెక్టర్ల‌ నిర్లక్ష్యం కారణంగా కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులు రోడ్డున ప‌డాల్సిన ప‌రిస్థితులు వ‌చ్చాయ‌ని లేఖ‌లో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అందుక‌ని హైకోర్టు జడ్జిమెంట్‌ను అయినా అమలు చేయండి, లేకుంటే చ‌నిపోయేందుకు అయినా ప‌ర్మిష‌న్ ఇవ్వండి అని రాష్ట్రపతి, గవర్నర్‌కు సూసైడ్‌ లేఖ రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement