– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
పేపర్ లీకేజీ కేసులో ఇవ్వాల (శుక్రవారం) ఉదయం బెయిల్ పొందిన కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియా సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ని వ్యక్తిగత దూషణ చేయడం సరికాదు. ఏ పోలీసు ఉద్యోగి, ఏ కేసులోనూ ప్రత్యేకంగా ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. మేము విధుల్లో చేరేటప్పుడే నిజాయితీతో, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ప్రజలకు సేవచేస్తామని ప్రతిజ్ఞ చేస్తాము. అలాంటిది కమిషనర్ ని ప్రమాణం చేయమని అడగడం అసంబద్ధమైన విషయం.
వరంగల్ కమిషనర్ గా ఉన్న రంగనాథ్ పనితీరును గతంలో తాను పనిచేసిన ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని సామాన్య ప్రజానీకాన్ని అడిగినా తెలుస్తుంది. లేదంటే ఆయా జిల్లాల్లోని బీజేపీ కార్యకర్తలను అడిగినా వాస్తవాలు తెలుస్తాయి. ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న సామాన్య ప్రజల సమస్యలను రాజకీయాలకు అతీతంగా.. పారదర్శకంగా పరిష్కరిస్తున్న తీరు యావత్ రాష్ట్రం గమనిస్తుంది. సమస్యలనుండి విముక్తి అయిన ప్రజానీకం పోలీసులకు, పోలీసు వ్యవస్థకు పాలాభిషేకాలతో బ్రహ్మరథం పడుతున్నారు. పోలీసులపై విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. సీపీ రంగనాథ్ తన కెరీర్ లో ఎన్నో ముఖ్యమైన, సంచలనాత్మకమైన కేసులను పరిష్కరించిన విషయం తెలంగాణ, ఏపీ ప్రజలందరికీ సుపరిచితమే.
ఈ కేసుకు సంబంధించి మీకున్న సందేహాలను విచారణలో భాగంగా నివృత్తి కోరవచ్చు. పోలీసు వ్యవస్థ అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తుంది. దీనికి సంబంధించిన మీ అభ్యంతరాలను న్యాయస్థానాల్లో తేల్చుకోవాలిగాని, చట్టబద్దంగాని ప్రమాణాలను చేయమని కోరడం అశాస్త్రీయం, అసంబద్ధం. పోలీసు అధికారులు, సిబ్బంది విశ్వసనీయతను ప్రశ్నించే మీ వైఖరిని మార్చుకోవాలని, పోలీసు కమిషనర్ రంగనాథ్ మీద చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డి మీడియాకు పంపిన లేఖలో వెల్లడించారు.