Tuesday, November 26, 2024

మూడు ప్రాజెక్టులతో 5.69ల‌క్ష‌ల‌ ఎకరాలకు నీరిచ్చాం: హ‌రీశ్ రావు

తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో రూ.3,663 కోట్లను ఖర్చుపెట్టి అసంపూర్తిగా ఉన్న మూడు ప్రాజెక్టులను పూర్తి చేసి 5లక్షల 69 వేల ఎకరాలకు నీరందించామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ… కాంగ్రెస్‌ పాలకుల నిర్లక్ష్యం వల్లే పాలమూరు వాసులు వలసలు పోయారన్నారు. ప్రాజెక్టులు తమ హయాంలోనే నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ నాయకుల వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రాజెక్టులు నిర్మిస్తే పాలమూరు వాసులు ఎందుకు వలసలు వెళ్లారని కాంగ్రెస్‌ సభ్యుడు భట్టి విక్రమార్కను ప్రశ్నించారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నెట్టంపాడు, కల్వకుర్తి, భీమా ప్రాజెక్టుల కింద కేవలం 27వేల 300 ఎకరాలు మాత్రమే పారిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పంపు హౌజ్‌లు పూర్తి కాలేదు. కాలువలు నిర్మించలేదు. పంపులు, మోటార్లు గడ్డ మీద పెట్టిండ్రు. పంపు హౌజ్‌లు తవ్వకుండానే బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టుల వద్ద చంద్రబాబు కొబ్బరి కాయలు కొడితే కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టుల వద్ద రాజశేఖర్‌రెడ్డి మొక్కలు నాటి డ్రామాలు ఆడారని ఎద్దేవా చేశారు. ఈ మూడు ప్రాజెక్టుల కింద 5లక్షల 69 వేలు, జూరాల కింద లక్ష ఎకరాలకు మొత్తం 7లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement