కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని, అయితే.. వాళ్లెంత సమర్థులో గమనించి వారికి ప్రయారిటీ ఇవ్వాలన్నారు కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్. కాంగ్రెస్ పార్టీలోకి ఖమ్మం జిల్లా నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేరికలపై వస్తున్న వార్తలపై ఆయన ఈ కామెంట్స్ చేశారు. వారి చేరికలతో పార్టీకి మేలే జరుగుతుంది కానీ, కొత్త వారు వచ్చినప్పుడు స్థానిక నేతలకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు.
ఇక.. పార్టీలో బీసీలకు ప్రాధాన్యం ఇస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం మరింత ఈజీ అవుతుందన్నారు మధుయాష్కీ. కానీ కొత్తవారితోనే పార్టీ గెలుస్తుందని భావిస్తే మాత్రం పొరపాటు అన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇద్దరు మాజీ సీఎంలు పార్టీలో చేరారని, కానీ ఎన్నికల్లో వారు ఓడిపోయారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వచ్చే నేతలు ఎంత సమర్థులో మనం చూసుకోవాల్సి అవసరం ఉందన్నారు. పార్టీలో చేరేవారు కాంట్రాక్టుల కోసం వస్తున్నారా? లేక పార్టీ కోసం వస్తున్నారా? అనేది కూడా తేలాలని కీలక వ్యాఖ్యలు చేశారు.