దేశంలో ఏ వ్యాక్సిన్ కూడా వైరస్ నుంచి వంద శాతం రక్షణ ఇవ్వదని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. అయితే వ్యాక్సిన్ ద్వారా యాంటీ బాడీలు పెరిగి వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయని చెప్పారు. దేశంలో కొవిడ్-19 కేసుల వ్యాప్తికి పలు కారణాలున్నాయని అన్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభం కావడం, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కొవిడ్ మార్గదర్శకాలను పాటించడం నిలిపివేశారని తెలిపారు. ఇదే సమయంలో కరోనా కొత్త వేరియంట్లు దేశంలో విపరీతంగా వ్యాప్తి చెందాయని చెప్పారు. కేసుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నెలకొందని చెప్పారు. తక్షణమే కేసుల సంఖ్యను కట్టడి చేయాల్సి ఉందన్నారు. ఆస్పత్రుల్లో పడకలు, మౌలిక వసతులను మెరుగుపరచాలని సూచించారు. దేశంలో మతపరమైన కార్యక్రమాలు, ఎన్నికలు జరుగుతున్నాయని వీటిని కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా నియంత్రిత పద్ధతిలో చేపట్టాలని పేర్కొన్నారు. 6,7 నెలల క్రితం ఢిల్లీలో ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నాయని రణదీప్ గులేరియా తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement