Monday, November 18, 2024

క‌రోనా అయితేంది.. ఒమిక్రాన్ వస్తే ఏంది.. వీ డోన్ట్ కేర్ అంటున్న తెలంగాణ ప్రజలు..

కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలు, వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌ ఆందోళనల వేళ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ఇప్పటికీ మందకొడిగానే సాగుతోంది. రెండు డోస్‌ల కరోనా వ్యాక్సిన్‌ వేసుకుంటేనే కొవిడ్‌ నుంచి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నా… తెలంగాణలో మాత్రం ఆశించినస్థాయిలో వ్యాక్సినేషన్‌ జరగడం లేదు. ఇప్పటికీ మొదటి డోస్‌ తీసుకున్న వారిలో 45శాతం మంది కరోనా రెండో డోస్‌ వేయించుకోలేదు. రాష్ట్రం లో 18ఏళ్లకు పైబడి… కరోనా టీకాకు అర్హులైన వారిలో 2,77,67000 మంది ఉండగా… వారిలో ఇప్పటి వరకు 11,96,4703 మంది అంటే 45శాతం మంది రెండో డోస్‌ టీకా తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌, లేదా థర్డ్‌ వేవ్‌ విరుచుకుపడితే మరోసారి సెకండ్‌ వేవ్‌ తరహా విపత్కర పరిస్థితులు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక దాదాపు 17 జిల్లాల్లో రెండు డోస్‌ల వ్యాక్సినేషన్‌ 50శాతం మందికి కూడా పూర్తికాలేదు.

కరోనా రిస్క్‌ ఎదుర్కొంటున్న దేశాల నుంచి తెలంగాణకు మరో 791 మంది వచ్చారు. వీరందరికీ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైద్య, ఆరోగ్యశాఖ ఆర్టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహించింది. వీరిలో మరొకరికి కొవిడ్‌ పాజిటివ్‌గా గుర్తించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు కొవిడ్‌ ఒమిక్రాన్‌ అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన 17మంది పాజిటివ్‌ శాంపిళ్లను జీనోమ్‌ టెస్టుకు పంపగా 13 మంది ఫలితాలు వచ్చాయి. ఇంకా నలుగురి ఫలితాలు రావాల్సి ఉంది.

తెలంగాణలో మరో 146 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,78,288 మందికి కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకోవడంతో వివిధ ఆస్పత్రుల నుంచి 189 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాతో మరో ఇద్దరు కన్నుమూశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 4007 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 3846 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26, 625 మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 72, రంగారెడ్డి 20లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement