ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రిగా ఉన్నారనే తాము, తమ నాయకుడు పుట్ట మధు ఈటల రాజేందర్ కు సాన్నిహిత్యంగా ఉన్నారే తప్ప మరో కారణం ఏమీ లేదని మంథని నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్ ను అడ్డం పెట్టుకుని మంథని టీఆర్ఎస్ లో చీలిక తెచ్చి లబ్ధి పొందాలని కొందరు కుట్ర పన్నుతున్నారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి, జెడ్పీ చైర్మన్ పుట్ట మదన్నపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. ఈటల రాజేందర్ విషయంలో ఆయన టీఆర్ఎస్ మంత్రిగా ఉన్న తరుణంలో ఆయనతో సన్నిహితంగా మెదిలామన్నారు. కానీ, ఆయన పార్టీకి దూరమైతే తామూ అతనికి దూరంగానే ఉంటామని తమకు పార్టీయే సుప్రీం తప్ప ఈటెల రాజేందర్ కాదని తేల్చిచెప్పారు. 2014లో కవిత ఆశీస్సులతో మంథని టీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న తమ నాయకుడు పుట్ట మధు పార్టీ అభ్యున్నతికోసం అహర్నిశలు పాటుపడుతున్నాడని వారు తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సీఎం కేసీఆర్ చలవతో మంథని నియోజకవర్గాన్ని అభివృద్ది చేశారని తెలిపారు.
మంథని చరిత్రలో రానన్ని నిధులను ఐదేళ్లలో తీసుకువచ్చి అభివృద్ధి చేశాడని పేర్కొన్నారు. 2018లో దురదృష్టవశాత్తు ఎమ్మెల్యేగా ఓడిపోయినా జెడ్పీ చైర్మన్ గా అవకాశం కల్పించి నియోజకవర్గ అభివృద్ధికి అండగా నిలిచారని కొనియాడారు. కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీ పట్ల, కేసీఆర్, కేటీఆర్, కవితక్కల పట్ల తమ నాయకుడు, తామూ ఎల్లవేళలా విధేయులుగానే ఉంటామని స్పష్టం చేశారు.