Friday, November 8, 2024

Wayanad Tragedy – ఆవు అరవడం వల్లే బతికిపోయాం

మా ఫ్యామిలీకి రక్షణ అదే
వయనాడ్​లో బతికి బయటపడ్డ కుటుంబం
చిన్నారితో సహా కొండపై ప్రదేశానికి
అర్ధరాత్రి పెద్ద ఎత్తున అరిచిన ఆవు
గొడ్ల కొట్టంలోకి బురద నీరు
పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నం
కండ్లకు కట్టినట్టు వివరించిన చామరాజనగర్​ వినోద్​​

వయనాడ్‌లోని చూరాల్‌మలలో కర్నాటక చామరాజనగర్‌కు చెందిన వినోద్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. వినోద్ భార్య ప్రవిద కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. వినోద్ మిగతా కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి తన ఇంట్లో వినోద్ నిద్రిస్తుండగా పశవుల శాలలోని ఆవు అరవడం మొదలుపెట్టింది. దీంతో వినోద్ లేచి అక్క‌డికి వెళ్లి చూడగా, అది నీటితో నిండిపోయి ఉంది. వరద, విపత్తును గ్రహించిన వినోద్ ఇతర కుటుంబ సభ్యులు జయశ్రీ, సిద్ధరాజు, మహేశ్, గౌరమ్మను నిద్రలేపి కొండపైన ఉన్న సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు. చూరాల్‌మలకు ఆరు కిలో మీట‌ర్ల‌ దూరంలో వినోద్ అత్తగారి ఊరు మెప్పడి ఉంది. వారికి అర్ధరాత్రి సమయంలోనే విపత్తు గురించి తెలియజేశాడు. దీంతో వారంతా అప్రమత్తమై సురక్షిత ప్రదేశానికి చేరుకున్నారు. అనంతరం పరిస్థితులు సద్దుమణిగాక మంగళవారం సాయంత్రం కారులో చామరాజనగర్​కు వచ్చారు.

- Advertisement -

కొండచరియలు విరిగిపడిన చోటే కుమార్తె పెళ్లి..

కొండచరియలు విరిగిపడిన ఘటనలో వినోద్ ఇల్లు కుప్పకూలింది. అలాగే అతడి వాహనం శిథిలాల కింద కూరుకుపోయింది. అలాగే వినోద్ ఇంటికి సమీపంలో ఉన్న వంతెన కూడా ధ్వంసం అయ్యింది. రెస్క్యూ బలగాలు కొండపై తలదాచుకున్న వినోద్, అతడి కుటుంబ సభ్యులను మంగళవారం సాయంత్రం సురక్షిత ప్రదేశాలకు తరలించాయి. తాము పెంచుకున్న ఆవు దేవుడిలా తమ ప్రాణాలను కాపాడిందని వినోద్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ‘కొండచరియలు విరిగిపడిన చోటే మా కుమార్తె పెళ్లి జరిగింది. మా అల్లుడు వినోద్ కుటుంబ సభ్యులు కొండపై చిక్కుకున్నారు. వారి ఇంటి సమీపంలోని బ్రిడ్జి కూడా విరిగిపోయింది. వారు అక్కడి నుంచి సురక్షిత ప్రదేశానికి ఎలా వచ్చారో అర్థం కావడం లేదు’ అని వినోద్ అత్త లక్ష్మి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement