Monday, November 18, 2024

Wayanad Landslide – దేవ‌భూమి శిధిలాల నుంచి 163 మృత దేహాలు వెలికితీత‌

ఇప్ప‌టికే 464 మందిని ర‌క్షించిన ఆర్మీ
శిధిలాల నుంచి 163 మృత దేహాలు వెలికితీత‌
రంగంలో జెసిబిలు, హెలికాప్ల‌ర్లు, క్రేన్ లు
అత్యంత వేగంగా శిథిలాల తొల‌గింపుతో
ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ‌ వంద‌లాది మృతి
ప‌చ్చ‌ని నేల‌లో ప్ర‌కృతి విల‌యం
విపత్తుల‌న్నీ జూన్,జులైలోనే…

వయనాడ్‌: కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 163 మంది చనిపోయినట్లు కేరళ వైద్యారోగ్య శాఖ బుధవారం ఉదయం తెలిపింది. మరో 91 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్ప‌టికే శిధిలాల నుంచి 464 మందిని ర‌క్షించారు.. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన 191 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

స‌మ‌న్వ‌యంతో కొన‌సాగుతున్న స‌హాయ కార్య‌క్ర‌మాలు

ఎన్డీఆర్ ఎఫ్, ఆర్మీ, డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ , స్థానిక పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది అత్యంత వేగంగా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో వంద‌లాది మంది ప్రాణాల‌ను కాపాడ‌గ‌లిగారు.. బుల్ డోజ‌ర్లు, క్రేన్ లు, డిటోనేట‌ర్లు, డ్రిల్లింగ్ మిష‌న్లు, వినియోగిస్తూ కూలిన కొండ చ‌రియ‌ల‌ను తొల‌గించ‌డంలో విజ‌యం సాధించారు.. చ‌రియ‌లు కింద ఎవ‌రైన ఉన్న‌రేమో త‌నిఖీ చేసేందుకు స్నిప‌ర్ డాగ్స్ ను వినియోగిస్తున్నారు.. కేర‌ళ‌కు చెందిన ఇద్ద‌రు మంత్రులు స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్యవేక్షిస్తున్నారు.. కేరళలోని వయనాడ్‌ జిల్లా మెప్పడి, మండక్కై, చూరాల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో వైద్య శిబిరాల‌ను ఏర్పాటు చేశారు.. ప‌రిస్థితి విష‌మించిన వారిని హెలికాప్టర్ ల‌లో తిరువునంత‌పురం , కోచ్చి హాస్ప‌ట‌ల్స్ కు త‌ర‌లిస్తున్నారు..

వయనాడ్‌లో రాబోయే రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్, పొరుగున ఉన్న మలప్పురం, కోజికోడ్, కన్నూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలు దెబ్బతినే అవకాశం ఉంది. వాయనాడ్‌లో ఇప్పటివరకు 464 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. వివిధ కేంద్ర ఏజెన్సీలకు చెందిన 300 మంది సిబ్బందిని రెస్క్యూ, రిలీఫ్ పనుల కోసం మోహరించారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

రెండు రోజులు సంతాప దినాలు

వాయనాడ్ ప్రమాదం తర్వాత కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. ఈ దురదృష్టకర ఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. వాయనాడ్‌లోని మెప్పాడి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారికి భారత్‌లోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ సంతాపం తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడి వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన సంఘటనల పరిస్థితిని సమీక్షించారు. కాగా కాంగ్రెస్ నేత‌, వ‌య‌నాడ్ మాజీ ఎంపి రాహుల్ గాంధీ, ఆయ‌న సోద‌రి ప్రియాంక గాంధీల వయ‌నాడ్ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది.. అక్క‌డ వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అనుకూలంగా లేక‌పోవ‌డంతో ప‌ర్య‌ట‌న వాయిదు వేసుకుంటున్న‌ట్లు రాహుల్ ప్ర‌క‌టించారు..

టీ కార్మికులు సేఫ్..

కేరళలోని వయనాడ్‌ జిల్లా మెప్పడి, మండక్కై, చూరాల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చరియలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ దొరకడం లేదని భావించారు . అయితే వారిలో అయిదు వంద‌ల మంది సుర‌క్షితంగా ఉన్న‌ట్లు గుర్తించారు. మిగిలిన వంద‌మంది కోసం అన్వేష‌ణ కొన‌సాగుతున్న‌ది..

ప‌చ్చ‌ని నేల‌లో ప్ర‌కృతి విల‌యం

దేవుళ్లు.. దేవతలు నడయాడే భూమిగా కేరళకు పేరు. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా ఉంటుంది కేరళ. ఈ రాష్ట్ర ప్రజల జీవన విధానం కాస్త కొత్తగా ఉంటుంది. పేరుకు దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైనప్పటికీ.. వీరు ఎక్కువగా ప్రక్రతి ఒడిలో జీవిస్తుంటారు. చుట్టూ పచ్చని వాతావరణంలో ప్రశాంత జీవనం సాగించే వీరికి.. ఏడాదిలో రెండు నెలలు మాత్రం కాళరాత్రుల్ని తలపించే పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.

సాధార‌ణంగా కేర‌ళ‌ల‌లో రాత్రి ఏడు దాటితే చాలా ప్రాంతాల్లోని రోడ్లపై జనాలు కనిపించరు. పట్టణాల్లో మాత్రమే కాదు.. రాష్ట్ర రాజధాని నగరంలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. నేచర్ కు దగ్గరగా జీవించే కేరళీయులకు ఏడాదిలో జులై.. ఆగస్టు మాసాలు చీకటి మాసాలుగా చెబుతారు. ఎందుకంటే.. ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న పెను విపత్తులన్నీ కూడా ఈ రెండు నెలల్లోనే చోటు చేసుకోవటం దీనికి కారణం.

తాజాగా కొండ చరియలు విరిగిపడిన ఘ‌ట‌న‌లో 163 మంది ప్రాణాలు కోల్పోతే.. మరో 128 మందికి గాయాలు అయ్యాయి. వందలాది మంది ఆచూకీ లభ్యం కావట్లేదు. వీరి కోసం వెతుకులాట భారీ ఎత్తున సాగుతోంది. ఓవైపు భారీ వర్షం మరోవైపు కొండ రాళ్లు విరుచుకుపడిన విషాదంలో వందల మంది బురదలో కూరుకుపోయారు. మొత్తంగా పెను విషాదం కేరళను కమ్మేసింది.

డెంజ‌ర్ మ‌న్త్స్…

జులై.. ఆగస్టు ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో కురిసే వానలు.. విరుచుకుపడే వరదలతో పలు విషాద ఉదంతాలు చోటుచేసుకోవటంతో… ఈ రెండు నెలల్లో అక్కడి ప్రజలు టెన్షన్ తో ఉంటారు. ఏ రోజు ఏ ముప్పు మీద పడుతుందన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. 2020 ఆగస్టు 6న ఇడుక్కి జిల్లాలోని పెట్టిముడిలో ఇదే తరహాలోభారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి 70 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019ఆగస్టులో మలప్పురం వయనాడ్.. కోళికోడ్ జిల్లాల్లోని పలుప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడిన ఉదంతాల్లో 76 మంది చనిపోయారు. వారిలో పదహారు మంది డెడ్ బాడీలు నేటికి లభించలేదు.

2018లో వ‌ర్ష బీభ‌త్సం..483 మంది దుర్మ‌ర‌ణం

2021 ఇడుక్కి జిల్లాలో రెండు చోట్ల కొండ చరియలు విరిగిపడి.. 21 మంది మరణించారు. 2018 ఆగస్టులో కేరళను తీవ్ర విషాదంలో ముంచెత్తిన వరదల్లో ఏకంగా 483 మంది మరణించటం.. దీనిపై కొంతకాలం క్రితం సినిమాగా రావటం తెలిసిందే. కేరళ వరద తీవ్రతను కళ్లకు కట్టినట్లుగా చూపిన ఈ సినిమా ఎందరినో కదిలించేసింది.

2018లో సాధారణ వర్షపాతం కంటే 23 శాతం ఎక్కువగా ఉండటంతో రిజర్వాయర్లన్నీ నిండిపోయాయి. దీంతో కేరళలోని 54 డ్యాముల్లో 34 డ్యాములను తెరిచి నీటిని వదిలేశారు. ఒకేసారి అన్ని డ్యాములను తెరవటం ఆ రాష్ట్ర చరిత్రలో అదే మొదటిసారి. ఆ సమయంలో కేరళలోని దాదాపు 5వేల చిన్న.. పెద్ద కొండచరియలు విరిగిపడినట్లు ఒక అంచనా. అడవుల నిర్మూలన.. పర్యావరణ మార్పులు.. పెరుగుతున్న భూతాపం.. ఆరేబియా ఉపరితల జలాలు వేడెక్కిన కారణంగానే 2018.. ఆ తర్వాత సంవత్సరాల్లో కేరళలో విపత్తులు ఎక్కువగా విరుచుకుపడినట్లుగా చెబుతారు.

కేరళలోని మొత్తం 14 జిల్లాల్లో ఒక్క అలప్పుజ జిల్లా తప్పించి మిగిలిన 13 జిల్లాలూ వరదలు..కొండచరియలు విరిగి పడే ముప్పును ఎదుర్కొంటున్నవే కావటం గమనార్హం. భారీగా కొండ చరియలు విరిగిపడటానికి భారీ వర్షాలు కారణంగా చెబుతున్నారు. దీనికి కారణం ఏమిటన్న దానిపై నిపుణుల వాదన ప్రకారం.. అరేబియా సముద్రం వేడెక్కుతుండటంతో కేరళలోని పలు ప్రాంతాల్లో డీప్ క్లౌడ్ సిస్టమ్స్ ఏర్పడి అతిభారీవర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు. మొత్తంగా మనిషి చేసే తప్పులకు.. మరో మనిషికి తిప్పలు, ప్రాణ‌కోటికి హ‌ని త‌ప్ప‌డం లేదు..

Advertisement

తాజా వార్తలు

Advertisement