Friday, November 22, 2024

ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ నీళ్ల లడాయి.. విద్యుత్‌ ఉత్పత్తిపై కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్‌ జలాల పంచాయితీ మరోసారి తెరపైకి వచ్చింది. విద్యుత్‌ ఉత్పత్తికి నాగార్జునసాగర్‌ నుంచి తెలంగాణ ప్రభుత్వం నీటిని అక్రమంగా వాడుకుంటోందని దీనికి అడ్డు కట్ట వేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు మంగళవారం లేఖ రాసింది. జల వనరుల శాఖ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి ఈ లేఖను రాశారు. ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. నాగార్జునసాగర్‌ నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం ఎలా లేఖ రాస్తుందని ఆయన నిలదీశారు. కృష్ణా నది జలాల వినియోగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదని అందుకే కేంద్రానికి చిల్లర మల్లర ఫిర్యాదులు చేస్తోందని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తిని ఆపివేస్తే ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోందని తాము తలుచుకుంటే కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేయలేమా అని ఆయన అన్నారు.

ముందస్తు అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్‌ నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఏపీ జల వనరులశాఖ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ కేఆర్‌ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ నీటి వినియోగాన్ని అడ్డుకోవాలని ఆ లేఖలో కోరింది. తాగునీటికి నీరు ఇవ్వకుండా విద్యుత్‌ ఉత్పత్తిని ఎలా చేస్తారని ప్రశ్నించింది. కృష్ణా నదీ జలాలను తెలంగాణ దుర్వినియోగం చేస్తోందని ఏపీ ప్రభుత్వం ఆక్షేపించింది. తెలంగాణ ప్రభుత్వాన్ని నిలువరించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కేఆర్‌ఎంబీని ఏపీ ప్రభుత్వం కోరింది. విద్యుదుత్పత్తి చేయగా వృధాగా పోతున్న నీటితో పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి ఇబ్బందులు వస్తున్నాయని ఏపీ సర్కారు ఆందోళన వ్యక్తం చేసింది. వేసవిలో తాగునీటి అవసరాలకు లేకుండా విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో నీటిని దుర్వినియోగం చేయడం తగదని పేర్కొంది. తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలని కేఆర్‌ఎంబీకి రాసిన లేఖలో పేర్కొంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి నీరు భారీగా వస్తోందని ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 40.580 టీఎంసీలేనని పేర్కొంది. నాగార్జునసాగర్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేశాక వదిలే నీటి ద్వారా పులిచింతల రిజర్వాయర్‌ నీటిమట్టం అసాధారణంగా పెరిగిపోతోందని ఏపీ ప్రభుత్వం అంటోంది. పులిచింతల ప్రాజెక్టుకు గత ఏడాది వచ్చిన వరద కారణంగా 16వ నెంబర్‌ గేటు కొట్టుకుపోయిందని గుర్తు చేసింది.

నీటి నిల్వ చేయలేక నీటిని పూర్తిగా సముద్రపాలు చేయాల్సి వచ్చిందని వాదిస్తోంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఔట్‌ ఫ్లో మరింత పెరిగితే పులిచింతల ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే అవకాశం ఉండదని ఇరిగేషన్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో పూర్తి స్థాయి నీటి నిల్వ ఉందని ఇంకా నీటిని విడుదల చేస్తే ఈ బ్యారేజీతో పాటు పులిచింతల ప్రాజెక్టుకు ఇబ్బందులు వస్తాయని పేర్కొంది. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఏపీ ఇరిగేషన్‌ శాఖ ఇంజనీర్లు తెలిపారు. వేసవిలో తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచుకోవాలని అన్ని ప్రాంతాలకు తాగునీటిని అందించాలంటే ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి వినియోగాన్ని అడ్డుకోవాల్సి ఉంటుందని భావిస్తోంది. తక్షణం విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేస్తున్న నీటి వినియోగాన్ని నిలుపుదల చేసి ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ సర్కార్‌ కేఆర్‌ఎంబీని కోరింది.
కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు చిల్లర వ్యవహారం : తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి

నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యుదుత్పత్తిని అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం చిల్లర వ్యవహారంగా మంత్రి జగదీష్‌రెడ్డి అభివర్ణించారు. అసంబద్ధమైన ఆరోపణలు, ఫిర్యాదులు చేసి ఏపీ ప్రభుత్వం తన గౌరవాన్ని దిగజార్చుకుంటోందని ఆయన మండిపడ్డారు. నాగార్జునసాగర్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీటిని తెలంగాణ వినియోగించడం లేదని ఆయన మంగళవారం సూర్యాపేటలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు. ఏపీ చేసిన ఫిర్యాదులో సహేతుక లేదని అన్నారు. విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉన్న సమయంలో గ్రిడ్‌ను కాపాడేందుకు సాంకేతికపరంగా ఐదు, పది నిమిషాలు అప్పుడప్పుడు విద్యుత్‌ ఉత్పత్తిని చేయడం సహజమని చెప్పారు. శ్రీశైలం నుంచి విద్యుత్‌ ఉత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం ఆపివేసినా ఏపీ ప్రభుత్వం తమవైపు ఉన్న పవర్‌ హౌస్‌లో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని ఆయన ఆరోపించారు. అయినా ఏపీ ప్రభుత్వం చేసిన విధంగా తెలంగాణ ప్రభుత్వం చిల్లరగా ఫిర్యాదులు చేయదని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో దుర్మార్గంగా కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్‌కు బలవంతంగా తరలించుకుపోయారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నీటి యాజమాన్యంపై అవగాహన లేదని అందుకే తెలంగాణ ప్రభుత్వంపై చీటికి మాటికి ఏపీ సర్కార్‌ కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement