Tuesday, November 26, 2024

భార‌త్ తో యుద్ధాలు.. త‌గిన పాఠాలు నేర్చుకున్నాం.. పాకిస్థాన్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పాకిస్థాన్ ప్ర‌ధాని భార‌త్ తో సంబంధాల‌పై మీడియాతో మాట్లాడారు. భారత్ తో తాము శాంతినే కోరుకుంటున్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. భారత్ తో మూడు యుద్ధాల నుంచి తాము పాఠాలు నేర్చుకున్నట్టు చెప్పారు. పాకిస్థాన్ శాంతినే కోరుకుంటోందంటూ, కశ్మీర్ లో జరుగుతున్న వాటిని ఆపాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను ప్రస్తావిస్తూ వాటిని విస్మరించలేమన్నారు. ఇంజనీర్లు, డాక్టర్లు, నిపుణులైన కార్మికులు ఉన్నారు. ఈ ఆస్తులను పురోగతి కోసం ఉపయోగించుకోవాలి. కశ్మీర్ ప్రాంతంలో శాంతి స్థాపన చేయాలి.

అప్పుడు రెండు దేశాలూ అభివృద్ధి చెందొచ్చు. శాంతియుతంగా జీవిస్తూ పురోగతి చెందడమా లేక ఒకరికొకరు కలహ మాడుకుంటూ వనరులను వృథా చేసుకోవడమా అన్నది మన ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. భారత్ తో మూడు యుద్ధాల్లో తలపడ్డాం. వాటి వల్ల కష్టాలు, పేదరికం, నిరుద్యోగం మిగిలాయి. మేం పాఠాలు నేర్చుకున్నాం. శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం. మనం అసలైన సమస్యలను పరిష్కరించుకోగలం. బాంబులు, మందుగుండు సామగ్రిపై పాకిస్థాన్ వనరులను వృథా చేసుకోవాలని అనుకోవడం లేద‌న్నారు. రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్నాయంటూ, ఒకవేళ దేవుడే కనుక యుద్ధానికి ఆదేశిస్తే అప్పుడు ఏం జరిగిందో చెప్పడానికి ఎవరు మిగిలి ఉంటార‌ని ఆయ‌న అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement