Wednesday, November 13, 2024

Warrior: తెలంగాణ వీరవనిత రాణి శంకరమ్మ.. రాయభగీన్‌ బిరుదుతో సత్కరించిన నిజాం

(ప్రశాంత్రెడ్డి, ప్రభ న్యూస్‌ బ్యూరో ఉమ్మడి మెదక్‌):

తెలంగాణ గడ్డ అంటే ధైర్య సహాసాలకు ప్రతీక. చరిత్రలో ఈ గడ్డమీద ఎంతో మంది వీరులు.. వీర నారీమణులున్నారు. వారిని ఈ తరం యత్కి తెలియజేయడానికి ఈ స్టోరీ.. తమ ధైర్య సహాసాలు, యుద్ధనీతి, శత్రువులకు అంతుచిక్కని వ్యూహాలతో ఎన్నో సాహస పోరాటాలు చేశారు. తమ రాజనీతితో ఎన్నో యుద్దాలను గెలిచి చరిత్రలో నిలిచారు. అయితే కొందరు పాలకులు ఇలాంటి ధైర్యసహాసాలు చూపిన వారిని స్మరించుకోకుండా.. తమకు అడ్డులేకుండా చేసుకోవడంతో పాటు వారి కీర్తిని చరిత్రలో లేకుండా చేశారు. అందులో రాణి శంకరమ్మ ఒకరు. మెదక్ జిల్లాలోని శంకరంపేట, పాపన్నపేట, సంగారెడ్డి, రాజంపేట గ్రామాలకు ఆ పేరు ఎట్లా వచ్చిందో తెలుసా.. అయితే ఈ స్టోరీ చదవి తెలుసుకోండి..

రాణి శంకరమ్మ ఆంథోల్‌ సంస్థానాన్ని పాలించిన వీరవనిత. ఈమె సంగారెడ్డి సమీపంలోని గౌడిచర్లలో 1702లో సంగారెడ్డి-రాజమ్మ దంపతులకు జన్మించింది. శంకరమ్మ బాల్యం నుంచి నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకుంది. ఇది గుర్తించిన తండ్రి సంగారెడ్డి ఆమెను వెన్నతట్టి ప్రోత్సహించారు. శంకరమ్మకు యుక్త వయస్సు వచ్చాక ఆంథోల్‌ సంస్థానాన్ని పాలించే రాజు నర్సింహ్మరెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. నరసింహ్మరెడ్డి సంస్థానమైన ఆంథోల్‌లో సిద్ధిఖీ సోదురులు పనిచేస్తుండే వారు. రాజుకు నమ్మకంగా ఉంటూనే వెన్నుపోటుపొడిచి రాజ్యం కైవసం చేసుకోవాలనే నీచపు బుద్ధి వారిది. ఈ క్రమంలోనే ఒక రోజు రాజు నర్సింహ్మరెడ్డిపై విష ప్రయోగం చేసి అంతమొందించారు. భర్త నర్సింహ్మరెడ్డి మరణించిన వేదనలో రాణి శంకరమ్మ మునిగి ఉండగా.. అప్పటి నైజాం రాజు శంకరమ్మను మరాఠా పేశ్వాల పై యుద్ధం చేయాలని ఆదేశించారు. సామంత రాజ్యం కావడంతో తప్పని పరిస్థితుల్లో భర్త మరణించినా కంఠంలోనే దు:ఖాన్ని దిగమింగి యుద్ధానికి కత్తిదూసింది.

మరాఠా పేశ్వాలను మట్టికరిపించి..
రాణి శంకరమ్మ తన భర్త మరణానంతరం ఆంథోల్‌ సంస్థానాన్ని పాలించింది. తన రాజ్యంలో ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకునేది. ప్రజలకు ఏ కష్టమొచ్చినా రాణి శంకరమ్మ ఉందనే ధై ర్యంతో నేరుగా దర్బార్‌ తలుపులు తట్టి సమస్యను విన్నవించేవారు. అంతలా ఆమె పాలన సాగింది. ఇదిలా ఉండగా నిజాం రాజు ఆదేశంతో మరాఠా పేశ్వాలపై యుద్ధానికి దిగింది. మరాఠా పేశ్వాల సైన్యం ఆరవీరభయంకరంగా ఉండేది. అయినా ఏమాత్రం వెనుకంజ వేయకుండా ధైర్యసహాసాలతో యుద్ధ కథనరంగంలో సైరా అంది. జుట్టు- ముడివేసీ, కాశేబోశి, కొంగు నడుం గట్టి, కత్తి పట్టి కదనాన కాలుదువ్వింది. ఆరు వేల అశ్విక దలం, వేలాది కాల్బలం (ఏనుగులు) తో పేశ్వాలను మట్టికరిపించి జయకేతనం ఎగురవేసి నిజాంరాజు చేత ఔరా నారీ అనిపించుకుంది. మరాఠా పేశ్వాలపై విజయం సాధించినందుకు గుర్తుగా నిజాం రాజు ఆమెకు ‘రాయభగీన్‌’ అనే బిరుదుతో సత్కరించాడు.

ధైర్యసహాసాలకు ప్రతీక..
రాణి శంకరమ్మ శత్రువుల పాలిట అపరకాళిక వలే దైర్య సాహసాలు ప్రదర్శించేది. ఏ సమస్యనైనా అవలీలగా, నేర్పుతో పరిష్కారం చూపేది. ఒక నాడు గౌడిచర్లలో చిరుత దాడి చేసి పశువులను చంపుతోందని ప్రజలు దర్బార్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే నేరుగా రంగంలోకి దిగిన శంకరమ్మ చిరుతతో కలబడింది. కర్రతిప్పటంలో ఆమెకు ఆమె సాటి. ఈ క్రమంలో చిరుతపై కలబడి చిరుతను మట్టి కరింపించింది. చిరుత గాండ్రిస్తూ మీద దూకినా ఏమాత్రం వెరువక కర్రసాముతో దాన్నిచితకబాది చంపేసింది.

- Advertisement -

మెతుకు సీమ కీర్తి నలుదిశలా విస్తరణ..
శంకరమ్మ 1764 లో సంస్థాన పాలన బాధ్యతలను చేపట్టి, తన పేరుతో శంకరంపేట, తండ్రి పేరుతో సంగారెడ్డి తల్లిపేరుతో రాజంపేట, సేనాపతి మీరెల్లి పాపాన్న పేరు మీద పాపన్నపేట గ్రామాలను నిర్మించి మెతుకు సీమను విస్తరించినది. శంకరమ్మ దత్తపుత్రుడే సదాశివరెడ్డి. శంకరమ్మ వయసు మీద పడగానే పాలనా బాధ్యతలు దత్తపుత్రుడైన సదాశివరెడ్డికి అప్పగించారు. ఆ రొజుల్లో నిజాం రాజు అలీఖాన్‌ దగ్గర మంత్రి మీరాలం పెత్తనం చెలాయించేవాడు. శంకరమ్మ తమ సంస్థానంలో మంత్రి మీరాలం సృష్టిస్తున్న అల్లర్ల గురించి కంప్లెయింట్ చేయడానికి వెళ్లి తిరిగివస్తండగా మంత్రి మీరాలం సైనికులతో ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అప్పటికే వయస్సుపైబడి, వృద్ధురాలైన శంకరమ్మ మనస్తాపం చెంది కొంత కాలానికి (1774లో) చనిపోయింది. ఇదీ మన తెలంగాణ వీర వనిత రాణి శంకరమ్మ ప్రస్థానం.. నేటి తరం తెలుసుకోవాల్సిన సరికొత్త విషయం..

ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement