వివిధ కేసుల్లో నిందితులుగా వున్న సమయంలో వారికి కోర్టు బెయిల్ ఇచ్చేందుకు కావల్సిన వత్రాలు, పూచికత్తు సంతకాలను ఫోర్జరీ చేసి ధ్రువీకరణ పత్రాలను సృష్టిస్తున్న ఐదుగురు సభ్యుల గ్యాంగ్ ను గురువారం టాస్క్ ఫోర్స్ మరియు నుబేదారి పోలీసులు అరెస్ట్ చేసారు. వీరి వద్ద నుంచి రబ్బర్ స్టాంపులు, ధ్రువీకరణ పత్రాలు, ఇంటి పన్ను రశీదులు, వివిధ వ్యక్తులకు సంబంధించిన అధార్ కార్డులు, పాస్పోర్ట్ సైజు ఫోటోలతో పాటు మూడు సెల్‌ఫోన్లు, మూడు వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ మూఠాకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణోషి మీడియాకు వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడైన రాజశేఖర్ అలియాస్ రాజేష్ నగరంలో ఒక లాయర్ వద్ద గుమాస్తా విధులు నిర్వహిస్తుండేవాడు. తన లాయర్ వద్దకు వివిధ కేసుల్లో నిందితులుగా వున్న వ్యక్తులకు కోర్టు బెయిల్ ఇచ్చేందుకు గాను అవసరమయిన పత్రాలు, పూచికత్తు సంతాకాలను సులభంగా సృష్టించేందుగాను నిందితుడు రాజశేఖర్ మిగితా నిందితులను సంప్రదించేవాడు. దీనితో మిగితా నిందితులు వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని వివిధ గ్రామాలకు సంబంధించిన పంచాయితీ రాజ్ విభాగాని రౌండ్ రబ్బర్ స్టాంపులు, గ్రామ పంచాయితీ కార్యదర్శి పేరు మీదగా హైదరాబాద్లో తయారు చేయించిన రబ్బర్ స్టాంపులను వినియోగించుకోని బెయిల్ కోసం పూచీకత్తు ఇస్తున్న వ్యక్తుల పేర్ల మీద గ్రామ పంచాయితీ కార్యదర్శి జారీ చేసిన రీతిలో దృవీకరణ పత్రం, ఇంటి విలువ, ఇంటి పన్నుకు సంబంధించిన ఫోర్జరీ పత్రాలను సృష్టించి నిందితుడు రాజశేఖర్ కు అందజేసేవారు.
నిందితులు బెయిల్ పత్రాలను కోర్టుకు అందజేసే సమయంలో ఫోర్జరీ పత్రాలతో పాటు పూచీకత్తు ఇస్తున్న వ్యక్తుల ఆధార్ కార్డులతో పాటు సదరు పూచీకత్తు ఇస్తున్న వ్యక్తులు న్యాయమూర్తి ముందు హజరయ్యేవారు. ఈ క్రమంలో ఈరోజు(డిసెంబర్ 16) ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక సుబేదారి పోలీసుల కల్సి సుబేదారి ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు రవీందర్ వాహనాన్ని అపి పోలీసులు తనిఖీ చేయగా అతని వద్ద అనధికారికంగా గ్రామ పంచాయితీ కార్యదర్శి, పంచాయితీ రాజ్ విభాగానికి సంబంధించి రౌండ్ షీల్డ్ రబ్బర్ స్టాంపులతో పాటు, ఇంటి విలువ, ఇంటి పన్ను రశీదులు దొరికాయి. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకోని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఇచ్చిన సమాచారంతో మిగితా వారిని కూడా అరెస్ట్ చేశారు.
ఈ ఫోర్జరీ బెయిల్ పత్రాలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టడంతో పాటు, ఈ ఫోర్టరీ పత్రాలను కోర్టుకు సమర్పించి బెయిల్ పోందిన నిందితులపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. అలాగే, ఈ ఫోర్జరీ పత్రాల వ్యహరాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు. నిందితులను గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, టాస్క్ఫ ర్స్ పోలీసులను అభినందించారు.